డిగ్రీ ఉన్నంతమాత్రాన ఉద్యోగం చేయాలని భార్యను ఒత్తిడి పెట్టలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వేరుగా ఉంటున్న భర్త భరణం చెల్లించాలనే లక్ష్యంగానే ఆమె ఉద్యోగానికి దూరంగా ఉంటున్నారని చెప్పలేమని వివరించింది. కాబట్టి, భరణాన్ని తగ్గించలేమని భర్త వేసిన పిటిషన్‌లో ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: భార్య డిగ్రీ పట్టా కలిగి ఉన్నదని, కాబట్టి, ఆమె ఉద్యోగం చేయాలని పట్టుబట్టలేమని ఢిల్లీ హైకోర్టు భర్త వేసిన మెయింటెనెన్స్ కేసులో తీర్పు ఇచ్చింది. విడిపోయిన భర్త నుంచి మెయింటెనెన్స్ పొందాలనే ఏకైక ఉద్దేశంతో ఉద్యోగం చేయకుండా ఉండబోరనీ పేర్కొంది.
విడాకుల కోసం వేరుగా ఉంటున్న భార్య భర్తలు ఇద్దరూ హైకోర్టులో మెయింటెనెన్స్‌కు సంబంధించి పిటిషన్లు వేశారు. నెలకు రూ. 25 వేలు తాను మెయింటెనెన్స్ ఇస్తున్నానని, ఆ మెయింటెనెన్స్‌ను రూ. 15 వేలకు తగ్గించాలని ఆయన అభ్యర్థించారు. తన భార్య డిగ్రీ పట్టా కలిగి ఉందని, ఆమె ఉద్యోగం చేస్తే మరిన్ని డబ్బులు వస్తాయని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు పై విధంగా స్పందించింది. డిగ్రీ పట్టా ఉన్నంతమాత్రానా భార్యను పని చేయాలని ఒత్తిడి చేయలేమని తెలిపింది. అలాగే, వేరుగా ఉంటున్న భర్త మెయింటెనెన్స్ అందించాలనే లక్ష్యంగానే ఉద్యోగం చేయకుండానూ ఉండబోరనీ వివరించింది. కాబట్టి, ఫ్యామిలీ కోర్టు నిర్దేశించిన మొత్తాన్ని తగ్గించలేమని స్పష్టం చేసింది.
Also Read: కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వ్యూహాలు.. కేసీఆర్ ఫార్ములాలోనే ఈ రెండు పార్టీలు?
ఇక ఈ భరణాన్ని పెంచాలనీ భార్య పిటిషన్ వేసింది. అయితే.. ఈ భరణం ఎందుకు పెంచాలో సరైన కారణాన్ని ఆమె పొందుపరచలేదని, ఫ్యామిలీ కోర్టు, ఆమె, ఆమె సంతానం ఖర్చులను పరిగణనలోకి తీసుకునే ఈ మొత్తాన్ని ఖరారు చేసిందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. కాబట్టి, భరణాన్ని పెంచలేమని చెబుతూ భార్య పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.