నేర చరిత అభ్యర్థులను ఎందుకు ఎంచుకున్నారో సరైన కారణం వెల్లడించాలి: పార్టీలకు ఈసీ ఆదేశం

By Mahesh KFirst Published Jan 8, 2022, 5:54 PM IST
Highlights

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ, పార్టీలు ఒక వేళ నేరచరిత ఉన్న అభ్యర్థులను ఎంచుకుంటే వారి వివరాలను తప్పకుండా ఆ పార్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అలాగే, ఆ నేర పూరిత వ్యక్తినే ఎందుకు అభ్యర్థిగా ఎంచుకున్నారో సరైన కారణం వివరించాలని తెలిపారు. కేవలం గెలిసే అవకాశం ఉన్నదనే కారణం సరికాదని స్పష్టం చేశారు.
 

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌(Assembly Election Schedule)ను ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర వెల్లడించారు. ఇదే సమావేశంలో ఆయన కీలక విషయాలను పేర్కొన్నారు. పార్టీలు నేర చరిత(Criminal History) ఉన్న వారిని అభ్యర్థులు(Candidates)గా ఎంచుకుంటే.. అందుకు గల కారణాలను వెల్లడించాలని స్పష్టం చేశారు. కేవలం గెలుపు సాధించే అవకాశం ఉన్నంత మాత్రానా ఎంచుకున్నామంటే కుదరదని వివరించారు. అందుకే వారినే అభ్యర్థిగా ఎంచుకోవడానికి గల కారణాలు తప్పకుండా వెల్లడించాలని ఆదేశించారు. అలాగే, వారి నేర చరితను తమ తమ పార్టీల వెబ్‌సైట్‌లలో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని చెప్పారు. అంతేకాదు, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని ‘మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి’ అనే విభాగంలోనూ పొందుపరచాలని ఆదేశించారు.

అభ్యర్థుల వివరాలను పార్టీలు తప్పకుండా వెల్లడించాలని ఆయన ఆదేశించారు. ఒక వేళ నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను ఎంచుకుంటే వారి వివరాలను వెల్లడించడమే కాదు.. ఎంచుకోవడానికి గల కచ్చితమైన కారణాలనూ తప్పకుండా బహిరంగ పరచాలని తెలిపారు. ఎందుకంటే భారత పౌరులకు తమ అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఉన్నదని పేర్కొన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఈ ప్రకటన చేసింది. 

దేశంలో రాజకీయ నాయకుల్లో ఎక్కువగా నేరస్తులు వస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయాల నుంచి నేరాలను వేరు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. రాజకీయ పార్టీలు నేరస్తులను అభ్యర్థులుగా ఎందుకు ఎంచుకుంటున్నాయని ప్రశ్నించింది. దేశ రాజకీయాలను నేర రహితంగా మార్చడానికి కచ్చితంగా కొన్ని నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది. అందులో భాగంగానే ప్రతి రాజకీయ పార్టీ ఒక వేళ నేరపూరిత వ్యక్తిని అభ్యర్థిగా ఎంచుకుంటే ఆయన నేర చరితను తప్పకుండా ఓటర్లకు తెలియజేసేలా పబ్లిష్ చేయాలని ఆదేశించింది. వారి నేర చరితను వెల్లడించడమే కాదు.. ఆ అభ్యర్థినే సదరు పార్టీ ఎందుకు ఎంచుకున్నదో తప్పకుండా వివరించాలని స్పష్టం చేసింది. కేవలం గెలుస్తాడనే నమ్మకంతో ఒక అభ్యర్థిని ఎంచుకున్నామంటే కుదరదని పేర్కొంది. ఆ అభ్యర్థిని ఎన్నుకోవడానికి గల సానుకూల అంశాలను వివరించాలని, కేవలం గెలుసే అవకాశం ఉన్నదని ఎంచుకోవద్దని వివరించింది.

ఒక వేళ రాజకీయ పార్టీలు నేర పూరిత అభ్యర్థుల వివరాలను వెల్లడించకపోయినా.. ఎన్నికల కమిషన్ తమ ఆదేశాలను అమలు చేయలేకపోయినా.. దాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10వ తేదీతో ప్రారంభం కానున్నాయి. యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మణిపూర్‌లో రెండు దశల్లో ఫిబ్రవరి 27, మార్చి 3న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

click me!