Paper Leak: కేంద్ర క్యాబినెట్‌ కీల‌క నిర్ణ‌యాలు.. ఇక‌పై పేప‌ర్ లీక్ చేస్తే అంతే సంగ‌తులు

Published : Jul 24, 2026, 03:52 PM IST
Paper Leak

సారాంశం

Paper Leak: పేప‌ర్ లీకుల‌కు పాల్ప‌డితే ఇక‌పై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో వరుసగా వెలుగుచూసిన ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పరీక్షల విశ్వసనీయతను కాపాడటంతో పాటు పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌ట‌క‌న రావాల్సి ఉంది.

ఫాస్ట్-ట్రాక్ కోర్టులు.. మూడు నెలల్లోనే విచారణ పూర్తి

కొత్త ప్రతిపాదనల ప్రకారం పేపర్ లీక్ కేసులను సాధారణ కోర్టుల్లో సంవత్సరాల తరబడి కొనసాగనివ్వకుండా ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టుల్లో విచారించనున్నారు. కేసు నమోదైన తర్వాత దర్యాప్తు, విచారణ పూర్తిచేసి మూడు నెలల్లోనే తీర్పు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రత్యేక న్యాయస్థానాలకు చట్టబద్ధ హోదా కల్పించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో తొలి ఫాస్ట్-ట్రాక్ కోర్టు ఏర్పాటు కాగా, మరిన్ని ప్రత్యేక కోర్టులను దశలవారీగా ప్రారంభించే ప్రణాళికపై కేంద్రం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దోషులకు త్వరగా శిక్షలు పడటమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడే వారిలో భయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

శిక్షలు మరింత కఠినం.. భారీ జరిమానా ప్రతిపాదన

ప్రస్తుతం అమల్లో ఉన్న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం–2024 ప్రకారం వ్యక్తిగతంగా పేపర్ లీక్‌కు పాల్పడితే 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. వ్యవస్థీకృత నేరాల్లో 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే తాజా సవరణలతో సంఘటిత పేపర్ లీక్ ముఠాలు, మాఫియాలపై చర్యలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతిపాదనల ప్రకారం ఇలాంటి కేసుల్లో గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు.

పరీక్షలపై విద్యార్థుల విశ్వాసాన్ని పెంచడమే లక్ష్యం

ఇటీవలి కాలంలో జరిగిన పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు లక్షలాది మంది అభ్యర్థుల్లో ఆందోళన కలిగించాయి. పరీక్షలు రాసే విద్యార్థుల కృషి వృథా కాకుండా, పారదర్శకతను కాపాడేందుకు బలమైన చట్టపరమైన వ్యవస్థ అవసరమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య పనిచేస్తున్న పేపర్ లీక్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించడం, పరీక్షల నిర్వహణలో విశ్వసనీయతను పెంచడం, దోషులను త్వరగా శిక్షించడం వంటి లక్ష్యాలతో కేంద్రం ఈ సంస్కరణలను తీసుకొస్తోంది.

త్వరలో పార్లమెంట్‌లో బిల్లు.. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ సవరణల ముసాయిదాకు ఆమోదం లభించినట్లు సమాచారం. త్వరలోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ లేదా పూర్తి వివరాలతో కూడిన ప్రకటన విడుదల కాలేదు. పార్లమెంట్ ఆమోదం అనంతరం ఈ సవరణలు అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రభుత్వ, పోటీ పరీక్షల్లో పేపర్ లీక్‌లపై మరింత కఠిన చట్టపరమైన చర్యలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ITR Filing Deadline 2026: ఐటీఆర్ ఫైలింగ్ డేట్.. ఇన్కమ్ టాక్స్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడం ఎలా? ఈ 5 విషయాలు తెలుసుకోవాల్సిందే!
Fact Check: ఢిల్లీ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారి పాస్‌పోర్టులు ర‌ద్దు చేయ‌నున్నారా.?