పాకిస్తాన్ హైకమిషన్‌కి కేక్ తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది. పహల్గాం దాడి తర్వాత బయటకు వచ్చిన ఈ వీడియో దేశ రాజధాని డిల్లీలోనే పాక్ సంబరాలు జరుపుకుందనే ఆరోపణలకు దారితీసింది.
Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదులు దాడి మానవత్వం కలిగిన ప్రతిఒక్కరి మనసులను కలచివేస్తోంది. సాటి మనిషులను అత్యంత క్రూరంగా కాల్చిచంపిన ముష్కరుల తీరును ప్రతిఒక్కరు తప్పుబడుతున్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం పహల్గాంలో జరిగిన మారణహోమాన్ని చూసి సంతోషిస్తోందా? అంటే భారతీయుల నుండి అవుననే సమాధానం వస్తోంది.
అనంత్ నాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసన్ లోయలో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించిన విషయం తెలిసిందే. 26 మంది పర్యాటకులను ముష్కరులు అతి దారుణంగా కాల్చిచంపారు. ఈ అమానుష సంఘటన వెనక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ బలంగా నమ్ముతోంది.ఇందుకు తగ్గట్లుగానే భారత్ లో పాకిస్థాన్ హైకమీషన్ కార్యాలయం వ్యవహరతీరు కనిపిస్తోంది.
దేశ రాజధాని డిల్లీలోని పాక్ ఎంబసీలో పహల్గాం ఉగ్రదాడి జరిగినందుకు సెలబ్రేట్ చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ హైకమీషన్ కార్యాలయానికి ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్లడమే ఈ అనుమానాలకు తావిస్తోంది. పాక్ హైకమీషన్ కార్యాలయానికి కేక్ తీసుకెళుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై భారత నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.
పాకిస్థాన్ హైకమీషన్ కు కేక్ తీసుకెళుతున్న వీడియో వైరల్ గా మారింది. ఈ కేక్‌ని తీసుకెళ్తున్న వ్యక్తి మీడియా ప్రశ్నలకు దాటవేస్తున్నట్లు కనిపిస్తుంది.“ఈ కేక్, వేడుక దేనికి? మీరు పాకిస్తాన్ హైకమిషన్ నుంచి వచ్చారా?” అని మీడియా ప్రతినిధులు ఆ వ్యక్తిని అడుగుతున్నట్లు వీడియోలో వినిపిస్తుంది.
🚨 SHAMEFUL! A cake was brought to the Pakistan High Commission, Delhi.
— Celebration of Pahalgam terror attack...? pic.twitter.com/Lt1ij4lFIi
ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ హైకమిషన్ దాడిని జరుపుకుంటుందని యూజర్లు ఆరోపించారు. దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పహల్గాం దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరగడంతో భారత్ వరుస చర్యలు తీసుకుంది. భారత్‌లో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాను నిలిపివేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశంలో 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది.
ఇంటిగ్రేటెడ్ అటారీ చెక్ పోస్ట్‌ను వెంటనే మూసివేయాలని, SAARC వీసా మినహాయింపు పథకం (SVES) కింద జారీ చేసిన వీసాలను రద్దు చేయాలని భారత్ నిర్ణయించింది. 48 గంటల్లోగా భారత్ వదిలి వెళ్ళాలని పాకిస్తాన్ పౌరులను ఆదేశించారు.
పాకిస్తాన్ హైకమిషన్‌లోని రక్షణ, సైనిక, నావికా మరియు వైమానిక సలహాదారులను వ్యక్తిత్వం లేని వ్యక్తులుగా ప్రకటించి, వారంలోపు భారత్ వదిలి వెళ్ళాలని ఆదేశించారు.భద్రతా చర్యగా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుండి తన సొంత రక్షణ, నావికా మరియు వైమానిక సలహాదారులను ఉపసంహరించుకోవాలని భారత్ నిర్ణయించింది. హైకమిషన్ల మొత్తం బలం ప్రస్తుతం 55 నుండి 30కి తగ్గించబడుతుంది, ఈ తగ్గింపులు మే 1, 2025 నుండి అమలులోకి వస్తాయి.