పహల్గాం బైసన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది అమాయక పర్యాటకులు మరణించారు. అయితే ఆ దాడికి పాల్పడిన ముష్కరులు కోడ్ నేమ్స్ వాడినట్లు తెలుస్తోంది. అవేంటో తెలుసా?
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది చనిపోయారు...ఇంకా చాలామంది గాయపడ్డారు. ఉగ్రవాదులు హిందూ పర్యాటకులే టార్గెట్ గా ఈ దాడికి పాల్పడ్డారు. పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు తాము ఎవరో తెలియకుండా ఉండేందుకు కోడ్ లాంగ్వేజ్ వాడినట్లు తెలుస్తోంది. వీరు మూసా, యూనస్, ఆసిఫ్ అనే కోడ్ నేమ్స్ వాడారని భద్రతా సంస్థలు బుధవారం వెల్లడించాయి. దాడి చేసిన వారిని ఆసిఫ్ షేక్, సులేమాన్ షా, అబూ తల్హాగా గుర్తించారు. వారు లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) సభ్యులని భావిస్తున్నారు.
అధికారుల ప్రకారం... ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు ముందు పుంచ్‌లో చురుగ్గా ఉండేవారు. ఆ ప్రాంతంలో ఉగ్రదాడులు చేసిన చరిత్ర వీరికి ఉంది. ఉగ్రవాదులు తమ గుర్తింపు దాచుకోవడానికి ఇలాంటి పేర్లు వాడటం కొత్తేమీ కాదు. భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పేర్లు గందరగోళం సృష్టించడానికి, గుర్తింపును తప్పించుకోవడానికి, ఉగ్రవాద నెట్‌వర్క్‌లో ప్రత్యామ్నాయ గుర్తింపును ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడంలో భాగంగా కనిపిస్తున్నాయి.
పహల్గాం దాడిలో బతికి బయటపడిన వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లను తయారు చేసి విడుదల చేశారు. నలుపు, తెలుపు పెన్సిల్ స్కెచ్‌లలో వారు యువకులు, గడ్డాలు ఉన్నట్లు చూపించారు. ఒక వ్యక్తి AK-47 రైఫిల్‌తో పారిపోతున్నట్లుగా ఒక మసకబారిన ఫోటో కూడా బయటపడింది. బతికి బయటపడిన వారు ఇచ్చిన సమాచారంతో ఈ ఫోటో సరిపోలుతోంది. దీని ప్రామాణికతను ఇంకా ధృవీకరిస్తున్నారు.
ఈ దాడి మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు పహల్గాం సమీపంలోని బైసరన్ గడ్డి భూములలో జరిగింది. భారత సైన్యం యూనిఫాంలో వచ్చిన ఉగ్రవాదులు బాధితులను ముందు వారి మతాన్ని అడిగి, ఆ తర్వాత కాల్పులు జరిపారని బతికి బయటపడినవారు తెలిపారు. చాలా మంది బాధితులను కాల్చే ముందు ఇస్లామిక్ శ్లోకాలు చదవమని ఉగ్రవాదులు చెప్పారట.
ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భారత సైన్యం తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని సందర్శించారు. "ఇది కేవలం పర్యాటకులపైనే కాదు, కాశ్మీర్ శాంతి, ప్రగతిపై దాడి. దీనికి కచ్చితంగా సమాధానం చెబుతాం" అని అమిత్ షా హెచ్చరించారు.