పహల్గాం ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన టిఆర్ఎఫ్ కమాండర్ ఆసిఫ్ పౌజీని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అతడి తలదాచుకున్న స్థావరాన్ని నలువైపుల నుండి చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడులపై భారత సైన్యం రివేంజ్ తీర్చుకుంటోంది. అమాయక పర్యాటకుల ప్రాణాలుతీసిన ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ను తుడిచిపెట్టేలా భారీ ప్లాన్ వేసింది. ఈ ఉగ్రవాద సంస్థ కమాండర్ ఆసిఫ్ పౌజీని అంతమొందించే పనిలో పడ్డారు. జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాంలో టిఆర్ఎఫ్ చీఫ్ తలదాచుకున్న స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. టంగ్ మార్గ్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
పహల్గాం బైసన్ లోయలో జరిగిన కాల్పుల్లో టీఆర్ఎఫ్ చీఫ్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. ఇతడితో పాటు మరో ఇద్దరుముగ్గురు ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో అటవీమార్గం గుండా పర్యాటకుల వద్దకు చేరుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రవాద కాల్పుల్లో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు... చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు. మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది.
ఈ ఉగ్రవాద దాడిని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. వెంటనే ప్రధాని మోదీ విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఇండియాకు వచ్చారు. అలాగే హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ కు వెళ్లి పరిస్థితి పర్యవేక్షించారు. అమాయక టూరిస్ట్ లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగి టిఆర్ఎఫ్ కమాండర్ స్థావరాన్ని గుర్తించి చుట్టుముట్టాయి. ఏ క్షణమైన అతడి అంతమొందించే అవకాశాలున్నాయి.
పహల్గాం ఉగ్రవాదుల దాడిని భద్రతా బలగాలు సీరియస్ గా తీసుకున్నాయి. పర్యాటకుల ప్రాణాలు బలితీసుకున్న ఉగ్రవాదులనే కాదు అసలు కశ్మీర్ లో ఉగ్రవాదమే లేకుండా చేసే పనిలో పడింది. ఇందుకోసం ఉగ్రకార్యకలాపాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో బారాముల్లా జిల్లాలోని ఉరిలో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
బుధవారం బారాముల్లాలోని ఉరి నాలాలోని సర్జీవన్ ప్రాంతం ద్వారా ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నించినప్పుడు భద్రతా దళాలతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయని భారత సైన్యం తెలిపింది. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చొరబాటు ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నామని సైనికాధికారులు తెలిపారు. ఉగ్రవాదుల నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపారు.