Pahalgam terror attack: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని యావత్ దేశం ఖండిస్తోంది. ఇది ముమ్మాటికీ పాకిస్థాన్ ప్రభుత్వ ప్రేపేరిత చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో అస్థిరత సృష్టించాలన్న ఉద్దేశంతో ఈ చర్యకు దిగినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏం చేద్దామన్న అంశాలపై గురువారం అన్ని పార్టీలతో సమావేశం కానున్నారు.
Pahalgam terror attack: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తూ గురువారం సర్వపక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించే అవకాశం ఉంది. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ దాడిపై వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పంచుకుంటారని తెలుస్తోంది.
మంగళవారం మధ్యాహ్నం జరిగిన దాడిలో ముష్కరులు పర్యాటకులకు టార్గెట్ చేసి దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఏకంగా 26 మంది మరణించగా, పలువురు గాయాలపాలయ్యారు. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని విషయం తెలిసిన వెంటనే టూర్ ను ముగించుకొని బుధవారం ఉదయం భారత్ కు వచ్చారు. వచ్చి రాగానే విమానశ్రయంలోనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సాయంత్రం నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. సమావేశంలో భారతదేశం 1960లో పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.
పాకిస్తాన్ సరిహద్దు దాటి ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోనంత వరకు సింధు జల ఒప్పందం నిలిపివేస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. ఇంతకు ముందు భారత్-పాక్ యుద్ధం వంటి పరిస్థితుల్లో కూడా ఈ ఒప్పందం కొనసాగింది. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి మృతదేహాలను ఇప్పుడు వారి ఇళ్లకు చేరుస్తున్నారు. కాన్పూర్‌కు చెందిన శుభమ్ ద్వివేది, నేపాల్‌కు చెందిన సుదీప్ మృతదేహాలను లక్నో విమానాశ్రయానికి తీసుకువచ్చారు, అక్కడ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ రావు మృతదేహం చెన్నైకి పంపించారు. అక్కడి నుంచి కావలికి చేర్చారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కాంగ్రెస్ నాయకుడు సెల్వపెరుంధగై నివాళులర్పించారు.