కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడితో యావత్ దేశం దిగ్బ్రాంతికి గురయ్యింది. ఈ క్రమంలో కాశ్మీర్ పర్యటనకు వెళ్లినవారి కుటుంబాలు, స్నేహితులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే టూరిస్టులు, బాధితుల సమాాచారం కోసం ఈ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి.
Pahalgam terror attack : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు... అమాయకులైన 27 మంది పర్యాటకుల ప్రాణాలు తీసారు. ఉగ్రదాడిలో మరింతమంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. పర్యాటకుల సమాచారం కోసం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను విడుదలచేసారు.
అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించివారు, గాయపడిన వారి వివరాలను ఈ ఎమర్జెన్సీ నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే కాశ్మీర్ లోని పర్యాటకుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
శ్రీనగర్ ఎమర్జెన్సీ కంట్రోల్ రూం నంబర్ : 0194-2457543, 0194-2483651
ఆదిల్ ఫరీద్, ఏడిసి శ్రీనగర్ : 7006058623
అనంత్ నాగ్ పోలీసుల హెల్ప్ లైన్ నంబర్ : 9596777669, 01932225870, వాట్సాఫ్ నంబర్ 9419051940
ప్రస్తుతం వేసవికాలం కావడంతో దేశ నలుమూలల నుండి జమ్మూ కాశ్మీర్ కు పర్యాటకులు వెళుతుంటారు. చల్లని ప్రదేశంలో హాయిగా సేదతీరదామని వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో కాశ్మీర్ పర్యటనలో ఉన్నవారి కుటుంబసభ్యులు, స్నేహితులు కంగారు పడుతున్నారు.
ఆ ఉగ్రదాడిపై వెంటనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ప్రస్తుతం అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాల ఆందోళన నేపథ్యంలో టూరిస్టులు, బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని బాధిత కుటుంబాలకు తెలియజేసేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటుచేసారు.
మంగళవారం మధ్యాహ్నం పహల్గాం హిల్ స్టేషన్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు పర్యాటకులను వారి మతాన్ని అడిగి కాల్పులు జరిపి భయాందోళనలు సృష్టించారు. హిందూ పర్యాటకులే టార్గెట్ గా మారణహోమం సృష్టించారు.
మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో బైసారన్ మైదానంలో కొంతమంది ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చినట్లు తెలుస్తోంది. వీరు ఒక్కసారిగా పర్యాటకుల ఐడీ కార్డులను పరిశీలించి హిందువులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో చాలామంది పర్యాటకులు మరణించారు.
గాయపడిన పర్యాటకులను వెంటనే పహల్గాంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన CCTV ఫుటేజ్ మరియు కొన్ని అనుమానాస్పద కార్యకలాపాల వీడియోలు భద్రతా సంస్థల వద్ద ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో ఇది లక్ష్యంగా చేసుకుని చేపట్టిన దాడిగా భావిస్తున్నారు.