Rahul Gandhi: మనోళ్లు వరల్డ్ కప్ కొట్టేవాళ్లే.. కానీ, ఏం జరిగిందంటే.. : ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విసుర్లు

By Mahesh K  |  First Published Nov 21, 2023, 4:26 PM IST

క్రికెట్ వరల్డ్ కప్ పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. టీమిండియా వరల్డ్ కప్ సాధించేదని, కానీ, అప్పుడే ఓ చెడు శకునం అక్కడకు వచ్చిందని, అందుకే కప్‌ను కోల్పోవాల్సి వచ్చిందని పరోక్షంగా ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుంటూ విమర్శించారు.
 


జైపూర్: రాజస్తాన్ ఎన్నికలు సమీపించిన వేళ అక్కడ కాంగ్రెస్ తరఫున అగ్రనేత రాహుల్ గాంధీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమిని ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంలో రాజస్తాన్ ప్రచారంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మనోళ్లు వరల్డ్ కప్ కొట్టేవాళ్లే. కానీ, అప్పుడు ఓ చెడు శకునం ఏర్పడింది. ఆ చెడు శకునం వల్లే మన టీమిండియా ఓడిపోయింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పరోక్షంగా ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ విసుర్లు సంధించారు.

రాజస్తాన్‌లోని జాలోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. టీమిండియా వరల్డ్ కప్ సాధించేదే కానీ, ఒక చెడు శకునం మూలంగా ఓడిపోయిందని అన్నారు. అదే విధంగా ఓబీసీ అంశాన్ని తీసుకుని ప్రధాని మోడీపై విమర్శలు సంధించారు. గతంలో తరుచూ తాను ఓబీసీ వర్గానికి ప్రతినిధిని అని, ఓబీసీ నేతను అని చెప్పుకున్న నరేంద్ర మోడీ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓబీసీలు పెద్ద సంఖ్యలో ఉంటారని, కానీ, వారి పురోభివృద్ధికి కించుత్తు కసరత్తు ఆయన చేయరని పేర్కొన్నారు.

Latest Videos

కాంగ్రెస్ పార్టీ మంగళవారం రాజస్తాన్‌లో మ్యానిఫెస్టోను ప్రకటించింది. జన ఘోషణ పత్రను విడుదల చేసింది. రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 25వ తేదీన జరుగుతాయి. ఒకే విడతలో ఎన్నికలు ముగుస్తాయి. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమకే అధికారాన్ని కొనసాగించేలా ఓట్లు వేయాలని కోరుతున్నారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఏడు హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. పంచాయతీ స్థాయిలో రిక్రూట్‌మెంట్లు జరిపే పథకం, కుల జనగణన చేపట్టడం వంటి హామీలను కాంగ్రెస్ ప్రకటించింది.

Also Read: Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వ పాలసీలతోనే హైదరాబాద్‌కు కంపెనీలు: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాకు మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ దారుణంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం మార్లెస్ కూడా హాజరయ్యారు.

click me!