ముంబై నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎయిర్ ఇండియా విమానం తిరిగి ముంబై ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది.
ముంబై నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎయిర్ ఇండియా విమానం తిరిగి ముంబై ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. వివరాలు.. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున 2:19 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ119 విమానం న్యూయార్క్‌కు బయలుదేరింది. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇరాన్ గగనతలం నుంచి తిరిగి ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. అయితే విమానం ముంబై ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇందుకు సంబంధించి ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఏఐ1119 ముంబై నుంచి జేఎఫ్‌కేకు బయలుదేరిన చిన్న సాంకేతిక సమస్య కారణంగా తిరిగి వచ్చింది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త తనిఖీల కోసం సురక్షితంగా తిరిగి ముంబైలో ల్యాండ్ చేయబడింది’’ అని ఎయిర్ ఇండియా ప్రకటనలో పేర్కొంది.
అయితే ప్రయాణికులకు వీలైనంత త్వరగా విమానాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసేందుకు ఎయిర్ ఇండియా కృషి చేస్తోందని తెలిపింది. ‘‘ప్రయాణికులు తమ గమ్యస్థానానికి తదుపరి అందుబాటులో ఉన్న విమానం కోసం వేచి ఉన్నప్పుడు హోటల్ వసతి, ప్రత్యామ్నాయ విమాన ఎంపికలు, టాక్సీ ఛార్జీలు, వడ్డించిన భోజనం మొదలైనవి అందించబడ్డాయి’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.