అభివృద్దిని అడ్డుకున్న ప్ర‌తిప‌క్షాలు.. త్రిపుర దక్షిణాసియాకు గేట్‌వేగా మార‌నుంది: ప్రధాని మోడీ

Published : Feb 11, 2023, 04:53 PM IST
అభివృద్దిని అడ్డుకున్న ప్ర‌తిప‌క్షాలు.. త్రిపుర దక్షిణాసియాకు గేట్‌వేగా మార‌నుంది: ప్రధాని మోడీ

సారాంశం

Agartala: త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై ప్రధాని న‌రేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు. త్రిపురలో పేదలు, గిరిజన వర్గాలు, మహిళలు, యువత కలలు వామపక్ష-కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల ఛిన్నాభిన్నమయ్యాయని ప్రధాని మోడీ అన్నారు. వారు త్రిపురను వదిలి వెళ్లాలని ప్రజలపై బలవంతపు చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ఆరోపించారు.  

Tripura Assembly election: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేప‌థ్యంలో త్రిపుర‌లో అన్ని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. మ‌రోసారి అధికారం నిల‌బెట్టుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) త‌న ముందున్న అన్ని వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకుంటోంది. ఆ పార్టీకి చెందిన అగ్రనేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే శ‌నివారం నాడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. రాధాకిషోర్ పూర్ లో తన రెండవ ర్యాలీలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి దోచుకుంటోందనీ, ప్రజలను పేదరికంలో బతకమని బలవంతం చేస్తోందని ఆరోపించారు. త్రిపురలో పేదలు, గిరిజన వర్గాలు, మహిళలు, యువత కలలు వామపక్షాలు, కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల ఛిన్నాభిన్నమయ్యాయని ప్రధాని మోడీ అన్నారు. త్రిపురను వదిలి వెళ్లాలని ప్రజలను బలవంతపు చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ఆరోపించారు.

త్రిపుర దక్షిణాసియా 'గేట్ వే'గా మారబోతోంది..

ఎన్నికలు జరగనున్న త్రిపురలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వ అభివృద్ధి పనులను హైలైట్ చేస్తూ, ఈశాన్య రాష్ట్రం దక్షిణాసియా 'గేట్ వే'గా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. అంబాస్సాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో గిరిజన ప్రజల కృషిని గుర్తించడానికి బీజేపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. త్రిపురలో "హీరా" (హైవేలు, ఇంటర్నెట్ వేస్, రైల్వేలు-ఎయిర్ వేస్) కు తాను హామీ ఇచ్చానని, ప్రాజెక్టుల డెలివరీని ప్రజలు చూడగలరని ప్రధాన మంత్రి అన్నారు. త్రిపురలో జాతీయ రహదారుల పొడవును రెట్టింపు చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.

అనేక అభివృద్ది ప‌నులు.. 

త్రిపుర‌లో అభివృద్ది ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. "త్రిపురలో గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ వేసే పనులు జరుగుతున్నాయి. గత ఎనిమిదేళ్లలో త్రిపురలో మూడు రెట్లు ఆప్టికల్ ఫైబర్ వేశారు. త్రిపురలోని గ్రామాలను కలుపుతూ 5,000 కిలోమీటర్ల మేర కొత్త రహదారులను నిర్మించారు. అగర్తలాలో కొత్త విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు. ఆప్టికల్ ఫైబర్, 4జీ కనెక్టివిటీని గ్రామాలకు తీసుకువస్తున్నారు. ఇప్పుడు త్రిపుర గ్లోబల్ గా మారుతోంది. ఈశాన్య, త్రిపురలను ఓడరేవులతో కలిపేందుకు జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నాం. త్రిపుర దక్షిణాసియా ముఖద్వారంగా మారబోతోంది" అని మోడీ పేర్కొన్నారు. 'గృహనిర్మాణం-ఆరోగ్యం-ఆదాయం' అనే మూడు అంశాలు త్రిపురకు సాధికారత కల్పిస్తున్నాయని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. పీఎం ఆవాస్ యోజన ఇక్కడి పేద ప్రజల జీవితాలను మార్చిందని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం పేదల కోసం 3 లక్షల పక్కా ఇళ్లు నిర్మించిందన్నారు.

అభివృద్దిని అడ్డుకుంటున్న ప్ర‌తిప‌క్షాలు.. :  మోడీ

త్రిపురలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధిని అడ్డుకున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. త్రిపురలో ప్రజల ఆదాయాన్ని పెంచడంపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పీఎం కిసాన్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని పెంచుతామన్నారు. త‌మ పాలనలో రైతులు ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) ప్రయోజనాలను పొందుతున్నార‌ని తెలిపారు. గతంలో త్రిపురలోని పోలీస్ స్టేషన్లను సీపీఎం క్యాడర్ ఆక్రమించుకుందని ఆరోపించిన ప్ర‌ధాని మోడీ.. ఇప్పుడు బీజేపీ పాలనలో రాష్ట్రంలో చట్టబద్ధ పాలన నడుస్తోందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మహిళా సాధికారత ఉందనీ, జీవన సౌలభ్యం ఉందని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టుల పాలన త్రిపుర అభివృద్ధికి ఆటంకం కలిగించిందని ఆరోపించారు. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని తీసుకొచ్చింద‌నీ, హింస ఇప్పుడు త్రిపుర అస్తిత్వం కాదన్నారు. "బీజేపీ రాష్ట్రాన్ని భయం, హింస లేని రాష్ట్రంగా మార్చింది. పేదలను ఎలా మోసం చేయాలో కాంగ్రెస్, వామపక్షాలకు మాత్రమే తెలుసు. వారు పేదలను ఏ సమస్య నుండి విముక్తం చేయలేరు. బీజేపీ మీ సేవకుడిగా, మీ నిజమైన సహచరుడిగా... మీ ప్రతి ఆందోళనను తొలగించడానికి రాత్రింబవళ్లు కష్టపడుతోంది" అని ఆయన అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !