వచ్చే 2024 ఎన్నికల్లో ప్రధాని మోడీని గద్దె దించేందుకు ఏకమైన విపక్ష నేతలు తమ కూటమికి కొత్త పేరును పెట్టారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌గా వున్న సోనియా గాంధీయే ఈ కూటమికి చీఫ్‌గా బాధ్యతలు చేపడతారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్న సంగతి తెలిసిందే. మూడోసారి అధికారాన్ని అందుకోవాలని బీజేపీ, మోడీని గద్దె దించాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పాట్నా, బెంగళూరులలో విపక్షాలు సమావేశమై కార్యాచరణపై చర్చించాయి. మోడీకి ధీటైన నేతను ఉమ్మడి అభ్యర్ధిగా నిలబెట్టాలని భావిస్తున్నాయి. అంతా బాగానే వుంది కానీ.. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి సంగతి పక్కన బెడితే.. ఈ కూటమి పేరెంటి అంటూ బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమికి ఇప్పటి వరకు యూపీఏ (యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలియెన్స్)గా ఉండేది. ఇదే పేరు ఉంటుందా? లేదా కొత్త పేరు పెడతారా? ఒకవేళ కొత్త పేరు పెడితే, ప్రధాని అభ్యర్థి కూడా కొత్తవారు అవుతారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనికి చెక్ పెడుతూ ఈ కూటమికి INDIA (indian national democratic inclusive alliance) అనే పేరును పెట్టారు. దీనికి నేతలంతా ఆమోదముద్ర వేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విపక్ష కూటమిని ఇకపై ‘‘INDIA’’గా పిలవనున్నారు.
2024 में बनाम INDIA का मुकाबला; संयुक्त विपक्ष के नेताओं ने गठबंधन का नाम ‘इंडिया’ रखा, जानें पूरा नामhttps://t.co/4Itk2ALdTh
— News24 (@news24tvchannel)
పరిస్ధితులను బట్టి మరిన్ని పార్టీలు , బీజేపీకి దూరంగా వుండే పార్టీలు ఈ కూటమిలో కలిసే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ప్రస్తుతం యూపీఏ ఛైర్‌పర్సన్‌గా వున్న సోనియా గాంధీయే ఈ కూటమికి చీఫ్‌గా బాధ్యతలు చేపడతారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
యునైటెడ్ వి స్టాండ్ అంటూ విపక్షా నినాదాన్ని పునరుద్ఘాటిస్తూ.. బెంగళూరులో సోమవారం జరిగిన సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని నిర్ణయించారు. దాదాపు 26 విపక్ష పార్టీలకు చెందిన నేతలు 2024 ఎన్నికలు, కార్యాచరణ, ఇబ్బందులపై చర్చించారు. ఇక విపక్ష పార్టీల నుంచి ప్రధాని అభ్యర్ధులుగా నితీష్ కుమార్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు బెంగళూరులో జరుగుతున్న విపక్షాల భేటీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం కొరకు అనేది మంత్రంగా వున్న పచ్చి అవినీతిపరుల సదస్సు జరుగుతోందన్నారు. గడిచిన 9 ఏళ్లలో కొత్త సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామని ప్రధాని తెలిపారు. గతంలో స్వార్ధపూరిత రాజకీయాల కారణంగా అభివృద్ధి ఫలాలు మారుమూల ప్రాంతాలకు చేరడం సాధ్యం కాలేదని ప్రధాని గుర్తుచేశారు.