
న్యూఢిల్లీ: ఆ అమ్మాయి వీధిలో రోడ్డుపై బెలూన్లు(Balloon) అమ్ముతూ జీవనం సాగిస్తున్నది. రోజులాగే పొట్టపోసుకోవడానికి బెలూన్లు పట్టుకుని వచ్చింది. కానీ, ఆ రోజు నిజంగానే ఆమె జీవింతంలో ఓ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఫొటోగ్రాఫర్ (Photographer) అర్జున్ క్రిష్ణన్ రూపంలో వచ్చింది. సాధారణంగా ఫొటోగ్రాఫర్లు సహజ సౌందర్యం కోసం వెతుకులాడుతుంటారు. సాధారణంలోనే అసాధారణం చూడటాన్ని అలవాటు చేసుకుంటుంటారు. అలాంటి ఫొటోగ్రాఫరే అర్జున్ క్రిష్ణన్. అక్కడే రోడ్డు పక్కన బెలూన్లు అమ్ముతున్న సాదాసీదా అమ్మాయి కిస్బూను చూశాడు. వెంటనే తన కెమెరా తీసి క్లిక్‌మనిపించాడు. కేరళకు చెందిన ఆ టీనేజ్ అమ్మాయి కిస్బూ ఫొటోలను సోషల్ మీడియాలో(Social Media) షేర్ చేసుకున్నాడు. ఆ ఫొటోలకు నెటిజన్ల నుంచి ఊహించలేనంత స్పందన వచ్చింది. రాత్రికి రాత్రే ఆ బాలిక సోషల్ మీడియాలో స్టార్ అయింది. ఆ ఆదరణే ఆమెను మోడల్(Model)గా మార్చేసింది.
కేరళలోని అందలూర్ కావులో జనవరి 7వ తేదీన జరిగిన ఫెస్టివల్‌లో ఓ ఆలయం దగ్గర టీనేజీ అమ్మాయి కిస్బూ బెలూన్లు అమ్ముతున్నది. చాలా సాదాసీదాగా ఉన్న ఆ బాలికలో ఏదో ప్రత్యేక ఆకర్షణ ఉన్నది. ఈ విషయాన్ని ఫొటోగ్రాఫర్ అర్జున్ క్రిష్ణన్ అంచనా వేశాడు. వెంటనే తన కెమెరాలో ఆమె చిత్రాలను బంధించాడు. కొన్ని ఫొటోలు తీసిన తర్వాత ఫొటోగ్రాఫర్ అర్జున్ క్రిష్ణన్.. కిస్బు, ఆమె తల్లి దగ్గరకు వెళ్లాడు. ఆయన తీసిన కిస్బు ఫొటోలను వారికి చూపించాడు. ఫొటోలు చూసి వారిద్దరూ నోరెళ్లబెట్టారు. ఆనందంతో మురిసిపోయారు.
ఆ తర్వాత ఫొటోగ్రాఫర్ అర్జున్ క్రిష్ణన్ సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు షేర్ చేశాడు. ఆ ఫొటోలు చాలా బాగుండటంతో కొందరు కిస్బు కుటుంబాన్ని చేరుకున్నారు. ఆమెతో ఫొటో షూట్ చేస్తామని ప్రతిపాదించారు. అందుకు కిస్బు కుటుంబం కూడా సంతోషంగా అంగీకరించింది. దీంతో ఆమెను అందమైన దుస్తులతో సౌందర్యంగా మార్చే పని మేకప్ ఆర్టిస్ట్ రెమ్యా ప్రజుల్‌కు దక్కింది. ఉదయం 4 గంటల ప్రాంతంలో కిస్బుకు మేకప్ వేయడం ప్రారంభించామని, మేనిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్ వంటివన్నీ చేశామని ఆమె చెప్పారు. కిస్బు కంఫర్ట్‌గా ఉండటానికి మేకప్‌లో ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పామని పేర్కొన్నారు.
కసావు చీర కట్టుకుని, బంగారు ఆభరణాలతో కిస్బును అలంకరించారు. ఈ మేకప్‌తో ఉన్న కిస్బును ఫొటోషూట్ చేశారు. ఆ మోడలింగ్ ఫొటోలనూ అర్జున్ క్రిష్ణన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. ఆ ఫొటోలకూ అనూహ్య ఆదరణ వచ్చింది. లైక్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. ఒక రకంగా కిస్బు బెలూన్లు అమ్ముకునే అమ్మాయి నుంచి రాత్రికి రాత్రే మోడల్‌గా ఎదిగారు. ఇక ఆమె తర్వాతి జీవితం ఎలా ఉంటుందనేది చూడాల్సిందే మరి.