
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరరివాలన్‌కు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ పెరరివాలన్ దాఖలు చేసిన పిటిషన్‌పై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోనందున.. అతనికి బెయిల్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆలోచన చేసింది. పెరారివాలన్ అభ్యర్థనపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉందంటూ కేంద్రం పిటిషన్‌ను సుప్రీం కోర్టు వ్యతిరేకించింది. ఈ కేసులో పెరరివాలన్ 30 ఏళ్ల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక, బుధవారం అతనికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. ‘అదనపు సొలిసిటర్ జనరల్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ.. పెరరివాలన్ ఇప్పటికే 30 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నందున.. అతను బెయిల్‌కు అర్హుడని మేము భావిస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక, పెరారివాలా యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించాలంటూ చేసిన అభ్యర్థన భారత రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ సమయంలో సుప్రీం కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పెరారివాలన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. ప్రతి నెల స్థానిక పోలీసు అధికారి ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. పోలీసులకు చెప్పకుండా స్వగ్రామం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి 19 ఏళ్ల వయసులో పెరరివాలన్ అరెస్టయ్యాడు.1999 మే నెలో పెరారివాలన్‌కు మరణశిక్ష విధించబడింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపిన బెల్ట్ బాంబును ప్రేరేపించడానికి ఉపయోగించిన 8-వోల్ట్ బ్యాటరీని కొనుగోలు చేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. 2014లో పెరరివాన్, మరో ఇద్దరు మురుగన్, సంతన్ (ఇద్దరూ శ్రీలంక వాసులు) క్షమాభిక్ష పిటిషన్‌లు సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్నందున మరణశిక్షను.. జీవిత ఖైదుగా మార్చారు. ఇక, తమిళనాడు ప్రభుత్వం 2018లో ఈ కేసులో పెరారివాలన్‌తో పాటు మరో ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలని రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేసింది.