Odisha Train Accident: రెస్క్యూ ఆపరేషన్ పూర్తి.. ట్రాక్ పునరుద్దరణ పనులు ప్రారంభం..

By Sumanth KanukulaFirst Published Jun 3, 2023, 2:03 PM IST
Highlights

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో 261 మంది  మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో 261 మంది  మరణించారు. 900 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని  చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తైనట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఘటన స్థలంలో రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. ‘‘రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తి చేసి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. మేము ఈ ప్రమాదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తాము’’ అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆయన ప్రస్తుతం ఘటన స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రైలు ప్రమాదం జరిగిన మార్గంలో కవచ్ సౌకర్యం లేదని రైల్వే శాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. 

Also Read: ఒడిశా రైలు ప్రమాదంపై భిన్న వాదనలు.. 20 నిమిషాల వ్యవధిలోనే భీతావహం.. అసలేం జరిగింది..?

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు.  కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇది జరిగిందని అన్నారు. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించిందని తెలిపారు. ప్రధాని మోదీ కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. 

Also Read: odisha train accident: అస్తవ్యస్తంగా పడిపోయిన బోగీలు.. భయాకన దృశాలు.. ప్రమాద స్థలంలోని డ్రోన్ విజువల్స్..

ఇక, రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను గోపాల్‌పూర్, ఖంతపరా, బాలాసోర్, భద్రక్, సోరో ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు బాధితుల బంధువులు ఘటన స్థలానికి చేరుకునేందుకు వీలుగా సమీప ప్రాంతాల వరకు రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాట్లు చేసింది. 

click me!