ఇది రాజకీయాలకు సమయం కాదు.. ఆ పరికరం రైలులో ఉంటే ఈ విషాదం జరిగేది కాదు.: మమతా బెనర్జీ

By Sumanth KanukulaFirst Published Jun 3, 2023, 1:50 PM IST
Highlights

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. ప్రమాదంపై కేంద్రం దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకున్న ఘటన స్థలాన్ని మమతా బెనర్జీ శనివారం సందర్శించారు. ప్రమాదం  జరిగిన తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ.. ఇది రాజకీయాలకు సమయం కాదని స్పష్టం చేశారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్‌కే అందరి ప్రాధాన్యత అని పశ్చిమ బెంగాల్ చెప్పారు. రైల్వే పరిహారంగా రూ. 10 లక్షలు అందజేస్తుందని.. తాము తమరాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు అందిస్తామని తెలిపారు.

‘‘కోరమాండల్ అత్యుత్తమ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒకటి. నేను మూడుసార్లు రైల్వే మంత్రిగా పనిచేశాను. నేను చూసిన దాని ప్రకారం. ఇది 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదం.  ఇలాంటి కేసులను రైల్వే సేఫ్టీ కమీషన్‌కి అప్పగిస్తారు.వారు దర్యాప్తు చేసి నివేదిక ఇస్తారు. రైలులో యాంటీ-కొలిజన్ పరికరం లేదు. నాకు తెలిసినంత వరకు ఆ పరికరం రైలులో ఉంటే.. ఇది జరిగేది కాదు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేము కానీ ఇప్పుడు మన పని రెస్క్యూ ఆపరేషన్, సాధారణ స్థితిని పునరుద్ధరించడం’’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

ఒడిశా ప్రభుత్వానికి, రైల్వేకు సహకరిస్తామని తెలిపారు. బెంగాల్ నుంచి అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని ఒడిశాకు తీసుకొచ్చినట్టుగా తెలిపారు. ప్రమాదంపై కేంద్రం విచారణ  జరపాలని డిమాండ్ చేశారు. రైల్వేలో సమన్వయ లోపం కనిపిస్తుందని అన్నారు. రైల్వే బడ్జెట్‌లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక, అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మమతా  బెనర్జీ పరామర్శించారు.

ఇక, బాలాసోర్ సమీపంలోని బహనాగ బజార్ వద్ద మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 261 మంది మరణించారు. ఈ ప్రమాదంలో  900 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గత 20 ఏళ్లలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా  చెబుతున్నారు. 

ఇక, ఒడిశాలో రైలు ప్రమాద స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పరిశీలించారు. ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యల గురించి ఆరా తీసిన అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెద్ద విషాదకరమైన ప్రమాదం. రైల్వే, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నాయి. సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించబడతాయి. ఈ ప్రమాదంపై వివరణాత్మక ఉన్నత స్థాయి విచారణ నిర్వహించబడుతుంది. రైలు భద్రతా కమిషనర్ స్వతంత్ర విచారణ కూడా చేస్తారు’’ అని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లపై ఉందని తెలిపారు. జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి వచ్చిన తర్వాత పునరుద్ధరణ ప్రారంభిస్తామని చెప్పారు. రైలు ప్రమాదానికి గల కారణాలు విచారణ తర్వాత తెలుస్తాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. అక్కడే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను అధికారులు వారికి వివరించారు. 
 

click me!