భార్యకు డ్రగ్స్ ఇచ్చి చంపేసిన నర్స్.. మరో నర్స్‌తో ఎఫైర్.. ఎలా చిక్కాడంటే?

By Mahesh KFirst Published Nov 24, 2022, 1:37 PM IST
Highlights

ఓ ప్రైవేట్ హాస్పిటల్ నర్స్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఐదు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. కానీ, తాను పని చేస్తున్న హాస్పిటల్‌లో మహిళా నర్సుతో ఎఫైర్ పెట్టుకున్నాడు. దీంతో తన భార్యను చంపేయాలని ప్లాన్ వేశాడు. తన హాస్పిటల్‌లో నుంచి కొన్ని డ్రగ్స్ దొంగిలించి ప్రాణాంతకమైన డ్రగ్స్ భార్యకు ఇంజెక్ట్ చేసి చంపేశాడు. 
 

న్యూఢిల్లీ: హాస్పిటల్‌లో నర్సులకు మెడిసిన్ పై అవగాహన తప్పకుండా ఉంటుంది. ఈ అవగాహనను ఓ వ్యక్తి తప్పుడు పనికి ఉపయోగించుకున్నాడు. తాను హాస్పిటల్‌లో పని చేస్తున్న ఓ నర్సు మరో మహిళా నర్సుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నాడు. అడ్డుగా ఉన్న తన భార్యను చంపేయాలని స్కెచ్ వేశాడు. తన భార్యను చంపడానికి ఓ ప్రాణాంతకమైన డ్రగ్స్ ఇచ్చాడు. ఆమె మరణాన్ని సూసైడ్‌గా చిత్రించే ప్రయత్నం చేశాడు. కానీ, చివరకు అతనే హంతకుడని కనిపెట్టారు. ఈ ఘటన మహారాష్ట్ర పూణెలో చోటుచేసుకుంది.

పూణెకు చెందిన స్వప్నిల్ సావంత్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తున్నాడు. ఐదు నెలల క్రితమే ఆయన ప్రియాంక క్షేత్రే అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అద్దె ఇంటిలో కాపురం పెట్టాడు. అయితే, అదే స్వప్నిల్ సావంత్‌కు అదే ప్రైవేట్ హాస్పిటల్‌లో ఓ మహిళ నర్సుతో అక్రమ సంబంధం ఉన్నది. ఆ నర్సును పెళ్లి చేసుకోవాలని ప్లాన్లు వేసుకున్నాడు. అంతకు ముందు ఐదు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న భార్యను చంపేయాలని అనుకున్నాడు. అందుకోసం పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాడు.

Also Read: యూపీలో మ‌రో ఘోరం.. అనుమానంతో భార్యను చంపి, మృతదేహాన్ని ముక్కలుగా న‌రికాడు.. !

నవంబర్ 14వ తేదీన తన భార్యను సీరియస్ కండీషన్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. వైద్యులు అప్పటికే ఆమె మరణించిందని తేల్చారు. ఇన్‌స్పెక్టర్ మనోజ్ యాదవ్ ఈ క్రైం గురించి మాట్లాడుతూ, ప్రియాంక దగ్గర ఓ సూసైడ్ నోట్ లభించిందని అన్నారు. సావంత్ పై గృహ హింస, ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగాల కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు. కానీ, విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆయన చెప్పారు.

ఆయన పని చేస్తున్న హాస్పిటల్ నుంచే కొన్ని డ్రగ్స్‌ను చోరీ చేసినట్టు తెలిసిందని పోలీసు తెలిపారు. వెకురోనియం బ్రోమైడ్, నైట్రోగ్లిజరిన్ ఇంజెక్షన్లు, లాక్స్ 2శాతం తాను పని చేస్తున్న హాస్పిటల్ నుంచి చోరీ చేసినట్టు వివరించారు. ఆ ప్రాణాంతక డ్రగ్స్‌నే తన భార్యకు ఇంజెక్ట్ చేసి చంపేశాడని పోలీసులు తెలిపారు. స్వప్నిల్ సావంత్ పై సంబంధిత సెక్షన్ల కింద కేసు పెట్టారని, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

click me!