ప్రజల సమ్మతి లేకుండా నిర్ణయం వుండదు.. కొత్త చట్టాలపై అమిత్ షా భరోసా : లక్షద్వీప్ ఎంపీ

By Siva KodatiFirst Published Jun 1, 2021, 7:03 PM IST
Highlights

‘‘సేవ్ లక్షద్వీప్’ ప్రచారం తీవ్రతరం కావడంతో కేంద్రప్రభుత్వం, బీజేపీ అధినాయకత్వం నష్ట నివారణా చర్యలు చేపట్టారు. ఈ ద్వీప సమూహనికి అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రఫుల్ ఖోడా పటేల్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలను మినహాయించాలని ఆదేశించింది. 

‘‘సేవ్ లక్షద్వీప్’ ప్రచారం తీవ్రతరం కావడంతో కేంద్రప్రభుత్వం, బీజేపీ అధినాయకత్వం నష్ట నివారణా చర్యలు చేపట్టారు. ఈ ద్వీప సమూహనికి అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రఫుల్ ఖోడా పటేల్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలను మినహాయించాలని ఆదేశించింది. అలాగే ఈ భారీ మార్పులను అమలు చేసే విషయంలో నెమ్మదిగా వెళ్ళమని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. దీవుల్లోని ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజెపి ప్రతినిధి బృందానికి సోమవారం హామీ ఇచ్చారు.

ప్రతిపాదిత మార్పులు కేవలం సూచనలు మాత్రమేనని, వాటిపై ప్రజల అభిప్రాయాన్ని కోరతామని హోంమంత్రి హామీ ఇచ్చినట్లు లక్ష్యద్వీప్ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఏపీ అబ్దుల్లాకుట్టి మీడియాకు తెలిపారు. ప్రజలు దీనిపై భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. వారి సమ్మతి కోసం ప్రజలతో చర్చలు జరుగుతాయని అబ్ధుల్లాకుట్టి అన్నారు. లక్షద్వీప్‌లో బీజేపీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ హాజీతో సహా బీజేపీ నేతలు అమిత్ షా, జేపీనడ్డా కలిశారు. 

లక్షద్వీప్ ప్రజలతో సంప్రదింపులు జరపకుండా, వారి అభిప్రాయాలను స్వీకరించకుండా ఎలాంటి కొత్త చట్టాలను తీసుకురాబోమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారని లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ తెలిపారు. అమిత్ షాతో భేటీ అయిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ.. లక్షద్వీప్ కొత్త అడ్మినిస్ట్రేటర్ పటేల్ ప్రతిపాదిస్తున్న కొత్త చట్టాలను తమ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని అమిత్ షాకు తెలిపానని చెప్పారు. తమ ద్వీప సమూహంలో జరుగుతున్న ప్రజా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లానని మొహమ్మద్ ఫైజల్ అన్నారు.

ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న కొత్త చట్టాల డ్రాఫ్టును లక్షద్వీప్ కు పంపుతామని... జిల్లా పంచాయతీల స్థాయిలో ప్రజాప్రతినిధులు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని అమిత్ షా చెప్పారని మొహమ్మద్ చెప్పారు. పటేల్‌ను తొలగించాలని కూడా తాను కోరానని చెప్పారు. ప్రఫుల్ ఖోడా పటేల్  కొత్త చట్టాలను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని... ఆవులను వధించడంపై బ్యాన్ విధించారని, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదనే కండిషన్ పెట్టారని, రిసార్టుల్లో లిక్కర్ అమ్మకాలను అనుమతించారని అసహనం వ్యక్తం చేశారు. లక్షద్వీప్ లో మెజారిటీ ప్రజలు ముస్లింలు అనే విషయం గమనార్హం.

తమ సమస్యపై చర్చించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారని మహమ్మద్ తెలిపారు. మరోవైపు ఈ కొత్త చట్టాల డ్రాఫ్ట్ ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా వ్యతిరేకించారు. లక్షద్వీప్ ప్రజలకు అండగా ఉంటామని ప్రకటించారు.

Also Read:లక్షద్వీప్ లో కొత్త చట్టాలు : ఏం చెబుతున్నాయి? వివాదాస్పదం ఎందుకవుతున్నాయి?

అటు లక్షద్వీప్‌లోని ప్రజల “ఆందోళనలు, ఫిర్యాదులు” గురించి బిజెపి నాయకులు నడ్డాకు వివరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఏమీ చేయకూడదని నడ్డా తమతో చెప్పారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. వారి సంక్షేమం , సమస్యలను దృష్టిలో ఉంచుకుని అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

అటు ప్రతిపాదిత నిబంధనలను నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు బిజెపి ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖాసిమ్. "ఒక వ్యక్తి యొక్క ఏకపక్ష నిర్ణయాలు" వివాదాన్ని సృష్టించాయని ఆయన మండిపడ్డారు. గడిచిన 22 సంవత్సరాలుగా బిజేపీ లక్షద్వీప్‌లో చురుకుగా ఉందన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఇక్కడి ప్రజల కోసం అనేక చర్యలు తీసుకున్నాయని ఖాసిమ్ గుర్తుచేశారు. వాజ్‌పేయి పదవీకాలంలో ఇప్పుడు వాడుకలో ఉన్న 22 నౌకలను కేంద్రం అందించిందని... ప్రస్తుత ప్రభుత్వం హెలికాప్టర్ల సంఖ్యను ఒకటి నుండి మూడుకు పెంచిందన్నారు. 

ముస్లిం ప్రాబల్యం ఉన్న లక్షద్వీప్‌లో అడ్మినిస్ట్రేటర్ పటేల్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. గొడ్డు మాంసంపై నిషేధం, నేరాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ గూండా చట్టం ప్రవేశపెట్టడం, ఇద్దరు పిల్లలకు మంచి సంతానం ఉన్న పంచాయతీ సభ్యులను  అనర్హులుగా ప్రకటించడం వంటి వాటిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 

click me!