NEET Exam: నీట్ లీకేజీ నేప‌థ్యంలో.. లోక్ స‌భ‌లో సోమ‌వారం కీల‌క బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్న కేంద్రం

Published : Jul 26, 2026, 05:09 PM IST
NEET Exam

సారాంశం

NEET Exam: నీట్ ప‌రీక్షా ప‌త్రం లీకేజీ వ్య‌వ‌హారం దేశవ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. జంత‌ర్‌మంత‌ర్‌లో యువ‌త చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌తో కేంద్రం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.

కఠిన చట్టంతో కేంద్రం కొత్త అడుగు

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో తరచూ వెలుగుచూస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, మాస్ కాపీయింగ్, మోసపూరిత చర్యలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమల్లో ఉన్న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024ను మరింత బలోపేతం చేస్తూ పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ సవరణలతో పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరగడమే కాకుండా, అక్రమాలకు పాల్పడే ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడనుంది.

ఈ సవరణ బిల్లు ఎందుకు తీసుకొచ్చారు.?

ఇటీవలి కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు వరుసగా చోటుచేసుకోవడంతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. పరీక్షలు రద్దు కావడం, మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరీక్షల విశ్వసనీయతను కాపాడడం, యువత భవిష్యత్తును రక్షించడం, పేపర్ లీక్ మాఫియాను అణిచివేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో కీలక మార్పులు చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరిగినా వాటిపై వేగంగా చర్యలు తీసుకునేలా నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

ఏయే పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది?

ఈ చట్టం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రధాన పరీక్షలన్నింటికీ వర్తిస్తుంది. ముఖ్యంగా యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే నియామక పరీక్షలు, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ (NEET), జేఈఈ (JEE), సీయూఈటీ (CUET) వంటి కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ప్రశ్నాపత్రాలు లేదా ఆన్సర్ కీలు బయటకు రావడం, ఓఎంఆర్ షీట్లలో మార్పులు చేయడం, ఇతరుల స్థానంలో పరీక్ష రాయించడం, నకిలీ అడ్మిట్ కార్డులు తయారు చేయడం, ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా మోసాలకు పాల్పడడం వంటి మొత్తం 15 రకాల చర్యలను నేరాలుగా గుర్తించారు. అయితే సాధారణంగా పరీక్ష రాసే విద్యార్థులను ఈ చట్టం కింద శిక్షించరు. అక్రమాలను నిర్వహించే ముఠాలు, మధ్యవర్తులు, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

పేపర్ లీక్ ముఠాలకు భారీ శిక్షలు

సవరణ బిల్లులో అత్యంత కీలకమైన అంశం శిక్షలను భారీగా పెంచడమే. పరీక్షల్లో కాపీయింగ్, ప్రాక్సీ అభ్యర్థులను ఉపయోగించడం వంటి అక్రమాలకు పాల్పడితే ఇకపై 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అదనంగా రూ.50 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు. ప్రశ్నాపత్రాల లీకేజీల వెనుక ఉన్న వ్యవస్థీకృత గ్యాంగ్‌లు, మాఫియా నెట్‌వర్క్‌లపై మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ఇలాంటి కేసుల్లో గరిష్ఠంగా రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం కల్పించారు. పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టి నిర్లక్ష్యం వహించిన లేదా అక్రమాలకు సహకరించిన సర్వీస్ ప్రొవైడర్ సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. అలాంటి సంస్థలకు రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఎనిమిదేళ్ల పాటు బ్లాక్‌లిస్ట్ చేసే నిబంధనను ప్రతిపాదించారు.

దర్యాప్తు, విచారణకు ఖచ్చితమైన గడువు

పేపర్ లీక్ కేసులు సంవత్సరాల తరబడి సాగకుండా ఉండేందుకు సవరణ బిల్లులో కాలపరిమితులను స్పష్టంగా పేర్కొన్నారు. కేసు నమోదైన తర్వాత రెండు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలి. ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత మూడు నెలల్లో విచారణ ముగించాలి. ఇందుకోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. దీంతో నిందితులకు త్వరగా శిక్షలు పడటంతో పాటు, విచారణలో ఆలస్యం తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

అప్పీళ్లకూ ప్రత్యేక విధానం.. విద్యార్థుల ప్రయోజనమే లక్ష్యం

పేపర్ లీక్ కేసుల్లో దిగువ కోర్టుల తీర్పులపై హైకోర్టులో అప్పీల్ చేసుకునే విధానాన్నీ సవరించారు. ఇకపై ఈ చట్టానికి సంబంధించిన అప్పీళ్లను హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక బెంచ్ మాత్రమే విచారిస్తుంది. అంతేకాదు, హైకోర్టులో దాఖలైన అప్పీళ్లను కూడా మూడు నెలల వ్యవధిలోనే పరిష్కరించాల్సిన నిబంధనను తీసుకువచ్చారు. దీంతో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సవరణల ద్వారా పరీక్షల నిర్వహణలో నమ్మకాన్ని పెంచడం, నిజాయితీగా చదివే విద్యార్థులకు న్యాయం చేయడం, పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అక్రమాలకు పాల్పడేవారిపై మరింత ఉక్కుపాదం మోపడంతో పాటు, దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చేందుకు ఈ చట్టం కీలకంగా మారే అవకాశముంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?