
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని (agnipath scheme) నిరసిస్తూ దేశవ్యాప్తంగా యువత, నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్ధులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనకారులు రైల్వే స్టేషన్లను, రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. తాజాగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (secunderabad railway station) జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. 13 మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (ashwini vaishnaw) స్పందించారు.
రైల్వే ఆస్తులను పరిరక్షించేందుకుగానూ రైల్వే చట్టాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఓ టీవీ ఛానెల్‌తో అశ్వీని వైష్ణవ్ మాట్లాడుతూ.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలు సమస్యకు పరిష్కారం కాదని హితవు పలికారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ‘అగ్నిపథ్’ నిరసనకారులకు రైల్వే మంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం.. యువత సమస్యలన్నింటినీ వింటుందని, వాటిని పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ALso REad : Agnipath : హింసాత్మక నిరసనలపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్
రైల్వేలు.. మన సొంత ఆస్తి అన్న సంగతిని అర్ధం చేసుకోవాలని అశ్వీని వైష్ణవ్ హితవు పలికారు. పేద, మధ్యతరగతి వర్గాలకు, విమాన సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకూ రైల్వేశాఖ సేవలు అందిస్తుందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే.. రైల్వే చట్టాన్ని మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పురోగతిపై స్పందిస్తూ.. గుజరాత్‌లోని వాపి, అహ్మదాబాద్ మధ్య 60 కి.మీ మేర ఇప్పటికే హైస్పీడ్ పిల్లర్ల నిర్మాణం పూర్తయినట్లు అశ్వీని వైష్ణవ్ పేర్కొన్నారు. 170 కి.మీ మేర పునాది పనులు పూర్తయ్యాయని, ఏడు నదులపై వంతెనల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు నడపనున్నట్లు అశ్వీని వైష్ణవ్ తెలిపారు.