
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాలు అన్ని కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, ఆ ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ప్రతిపాదించే యోచన చేయగా.. ఆయన తాను రాష్ట్రపతి బరిలో లేనని స్పష్టం చేశారు. తాజాగా, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కూడా అదే దారిలో వెళ్లారు. తాను రాష్ట్రపతి అభ్యర్థుల బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు.
జమ్ము కశ్మీర్ సంక్లిష్ట పరిస్థితుల గుండా వెళ్లుతున్నదని, తాను జమ్ము కశ్మీర్‌ను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నదని ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు. అందుకే ప్రతిపక్షాలు పరిగణిస్తున్న రాష్ట్రపతి అభ్యర్థుల జాబితా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తన పేరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించిన తర్వాత చాలా మంది నేతలు తనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారని వివరించారు. దీదీతోపాటు ఇతర నేతల మద్దతు, ఆదరణ తనలో సంతోషాన్ని నింపిందని ఆయన తెలిపారు. అనుకోని ఈ పరిణామం గురించి తాను తన పార్టీ సీనియర్ నేతలు, కుటుంబ సభ్యులతో చర్చించానని వివరించారు.
ప్రస్తుతం జమ్ము కశ్మీర్ సంక్లిష్ట పరిస్థితుల గుండా వెళ్తున్నదని, ఈ అనిశ్చిత కాలంలో జమ్ము కశ్మీర్‌కు దారి చూపడంలో సహకరించాల్సిన బాధ్యత తనపై ఉన్నదని పేర్కొన్నారు. తన ముందు ఎన్నో క్రియాశీలక రాజకీయాలు ఉన్నాయని, జమ్ము కశ్మీర్‌కు, దేశానికి తాను సానుకూల సేవలు అందిస్తానని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
తాను బరిలో లేకున్నా.. ప్రతిపక్షాలు ఉమ్మడిగా బరిలోకి దించే అభ్యర్థికి తన మద్దతు ఉంటుందని వెల్లడించారు.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరి కల్లా నిర్వహిస్తా మని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే ఫరూఖ్ అబ్దుల్లా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.