మోడీగారు.. మీరు లఖీంపూర్ వెళ్ళగలరా?.. ప్రధానికి ప్రియాంకా గాంధీ సూటిప్రశ్న..

By AN TeluguFirst Published Oct 5, 2021, 11:32 AM IST
Highlights

"ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రతిపక్షాలను ఎలా, ఎందుకు అరెస్టు చేస్తారు. రాష్ డ్రైవింగ్ తో అంతమంది మరణానికి కారణమైన, భయంకరమైన నేరం చేసిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదు అంటూ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ.. మీరు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయండి, మాలాంటి వారిని కాదు" అని ప్రియాంక గాంధీ గవర్నమెంట్ గెస్ట్ హౌజ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

న్యూఢిల్లీ : లఖీమ్ పూర్ ఖేరీ (Lakhimpur Kheri) వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Arrest)ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ప్రియాంకా గాంధీ వాద్రా మంగళవారం మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ (UP Violence)ప్రభుత్వం తనను 24 గంటల పాటు నిరవధికంగా నిర్బంధించిందని మండిపడ్డారు. ప్రధాని కావాలనే ప్రతిపక్షాలను అడ్డుకున్నారని, లఖింపూర్‌ ఖేరీలో జరిగిన నిరసన కార్యక్రమంలో రైతులపై ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి కుమారుడి ఘటనలో నిజానిజాలు దాచాలని చూస్తున్నారని ప్రదాని లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు.

"ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రతిపక్షాలను ఎలా, ఎందుకు అరెస్టు చేస్తారు. రాష్ డ్రైవింగ్ తో అంతమంది మరణానికి కారణమైన, భయంకరమైన నేరం చేసిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేయలేదు అంటూ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ.. మీరు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయండి, మాలాంటి వారిని కాదు" అని ప్రియాంక గాంధీ గవర్నమెంట్ గెస్ట్ హౌజ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సోమవారం ఉదయం నుండి ఆమెను సీతాపూర్ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో నిర్బంధించిన విషయం తెలిసిందే.

స్వాతంత్ర్య దినోత్సవంతో ముడిపడి ఉన్న "ఆజాది కా అమృత్ మహోత్సవం" కోసం త్వరలో లక్నోలో జరిగే ఒక కార్యక్రమానికి ప్రధాని మోడీ పర్యటించనున్నారని ఆమె అన్నారు. దీని గురించి ప్రస్తావిస్తూ.. 

"స్వేచ్ఛా మహోత్సవాన్ని జరుపుకోవడానికి మోడీ లక్నో వస్తున్నారు. మనకు స్వాతంత్య్రం ఇచ్చింది ఎవరు? రైతులు మనకు స్వేచ్ఛ ఇచ్చారు. రైతుల మీద ఇంత దురాగతానికి పాల్పడిన మీ మంత్రిని బర్తరఫ్ చేసి, అతని కొడుకును అరెస్టు చేయకుండా లక్నోలో పర్యటించే ఎలాంటి నైతిక అధికారం మీకు ఉందా? అని సూటి ప్రశ్న వేశారు. ఘటనకు కారణమైన సదరు మంత్రి పదవిలో కొనసాగితో.. ఈ ప్రభుత్వానికి పాలించే నైతిక అధికారం ఉండదు" అంటూ ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు.

ఆదివారం, లఖ్‌నపూర్ నుండి నాలుగు గంటల దూరంలో ఉన్న లఖింపూర్ ఖేరీలో రైతులు ఒక కార్యక్రమం కోసం వచ్చిన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను ఘెరావ్ చేశారు. ఆ సమయంలో మంత్రి కాన్వాయ్‌లో ఒక ఎస్‌యూవీ నిరసనకారుల బృందం మీదికి దూసుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు.

ఘటన జరిగిన సమయంలో ఎస్‌యూవీని కేంద్రమంత్రి మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడని రైతులు ఆరోపిస్తూ మృతదేహాలతో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు ఆశిష్ మిశ్రాపై హత్యారోపణలు నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కానీ, అతడిని ఇంకా అరెస్టు చేయలేదు.

Lakhimpur Kheri Violence : ప్రియాంక గాంధీ అరెస్ట్, అఖిలేష్ యాదవ్ హౌస్ అరెస్ట్..

ఈ సంఘటనకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ప్రామాణికత నిర్ధారించబడలేదు. ప్రియాంక గాంధీ ఈ వీడియోను షేర్ చేస్తూ.. దీనికి ప్రధాని మోడీని ట్యాగ్ చేశారు. ఒక ప్రశ్నను కూడా సంధించారు: "" @narendramodi సర్, మీ ప్రభుత్వం గత 28 గంటల పాటు ఎలాంటి ఆర్డర్, FIR లేకుండా నన్ను నిర్బంధంలో ఉంచింది. అన్నదాతను (రైతులను) చితకబాదిన ఈ వ్యక్తిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు?"

ఎన్‌డిటివితో మాట్లాడుతూ, ప్రియాంక గాంధీ తాను విడుదలయ్యాక చేసే మొదటి పని చనిపోయిన రైతుల కుటుంబాలను కలవడం అని అన్నారు.  ఆదివారం రాత్రి లఖింపూర్ ఖేరీకి వెడుతున్న ప్రియాంకాగాంధీని సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.

"అందుకే నన్ను విడుదల చేయకపోవచ్చు" అని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను "15 రోజులు, 20 రోజులు, ఆరు నెలలు లేదా ఆరు సంవత్సరాలు" అయినా సరే జైలులో ఉండడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

అరెస్టుకు సంబంధించి తనకు నోటీసులు అందలేదు, ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. కాబట్టి తను లీగల్ ఆప్షన్లను అన్వేషిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకురాలు చెప్పుకొచ్చారు.

తనను రాజకీయ అవకాశవాది అని పిలిచినందుకు బిజెపిపై విరుచుకుపడుతూ, ప్రియాంకా గాంధీ ఇలా ప్రతిస్పందించారు: "ఈ దేశంలోని ప్రతి వ్యక్తి- ప్రతి చిన్నారికి అతిపెద్ద రాజకీయ అవకాశవాది ఎవరో తెలుసు. వారు మమ్మల్ని, మా రాజకీయాలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదేం పెద్ద విషయం కాదు. కానీ నేను నేను రాజకీయాల పట్ల చాలా సీరియస్‌గా ఉన్నాను. నేను సీరియస్‌గా పని చేస్తున్నాను. అంతేకానీ, చైనా ప్రెసిడెంట్‌తో జూలా లో కూర్చోను. నేను జపాన్‌ను సందర్శించను. ప్రధాని ప్రపంచ పర్యటన చేస్తాడు. దేశంలోకెల్లా అతి పెద్ద టూరిస్ట్ అతనే. "

ఇంకా మాట్లాడుతూ.. "నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీకి చెందినదాన్ని.. సమస్యలను లేవనెత్తడం, ప్రజల పక్షాన నిలబడడం, ప్రజల గొంతుగా నిలవడం నా పని. రైతులు నెలరోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆ రైతు కుమారుడే మన సరిహద్దులను కాపాడుతున్నది. ప్రతి ప్రతిపక్ష పార్టీ లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి ప్రయత్నించకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వ్యవహరించి ఉండేదా? " అని ప్రశ్నించారు. 
 

click me!