ఢిల్లీలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీని ఎన్డీయే పక్షనేతగా ఈ సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఎన్డీయేని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకే మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని కొనియాడారు.
ఢిల్లీలో పాత పార్లమెంటు భవనంలో ఎన్‌డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీతో పాటు మిత్ర పక్షాలైన తెలుదేశం, జనసేన, జేడీయూ, జేడీఎస్ ఇతర పార్టీల అధినేతలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎన్‌డీయే నేతలు ఘన స్వాగతం పలికారు.
ప్రధాని మోదీ ముందుగా భారత రాజ్యాంగానికి నమస్కరించి.. ఎన్‌డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభించారు. వేదికపై ప్రధాని మోదీ పక్క సీట్లోనే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి స్థానం కల్పించడం విశేషం. వేదికపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్ ఇతర నేతలు ఆశీనులయ్యారు.
ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబు.. ఎన్‌డీయే నేతగా నరేంద్ర మోదీని బలపరుస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా ఏమన్నారంటే...
‘‘ఎన్డీయేని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ లాంటి పలువురు కేంద్ర మంత్రులు సైతం ఏపీలో పర్యటించి... ప్రజల్లో విశ్వాసం కల్పించారు. కేంద్ర ప్రభుత్వం తమతో ఉందన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించారు'' అని చంద్రాబాబు కొనియారు.
''పదేళ్లలో దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్‌ను గ్లోబల్ పవర్ హౌజ్‌గా మార్చారు. మోదీ నాయకత్వంలోనే భారత్ ఐదో అతిపెద్దగా ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఆయన నాయకత్వంలోనే మూడో అతిపెద్దగా ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న నమ్మకం ఉంది. వికసిత్ భారత్ -2047 లక్ష్యం నెరవేరుతుంది. భారత్ నంబర్ వన్‌గా అవతరిస్తుంది. కేంద్రంలో ఎన్‌డీయేని అధికారంలోకి తీసుకురావడానికి మోదీ కష్టపడినట్లే.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ పనిచేశాయి. మిత్రుడు పవన్ కల్యాణ్, పురందేశ్వరి సహా మేమంతా ఎలాంటి భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేశామని'' చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ఎన్‌టీ రామారావు ప్రజల కోసమే పనిచేశారు. ఎన్‌టీఆర్‌కు ఉన్న ఒకే ఒక్క ఇజం హ్యూమనిజం. ప్రస్తుతం అదే మానవత్వాన్ని, విజనరీని మోదీలో చూస్తున్నాం. మోదీ వల్లే దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ దేశాలు 2 నుంచి 3శాతం అభివృద్ధి సాధిస్తుంటే.. భారత్ అంతకు మించి వేగంగా పురోగతి సాధిస్తోంది'' అని కొనియాడారు.