వ్యాపారంలో రాణించాలన్నా.. మంచి విజయం అందుకోవాలన్నా.. ఓపిక, పట్టుదల చాలా చాలా అవసరం. ఇవి ఉంటేనే ఏ వ్యక్తి అయినా జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తాడు. ఇలాంటి వ్యక్తుల్లో 'ఎండీహెచ్ అంకుల్', 'మసాలా కింగ్', 'దాదాజీ', 'కింగ్ ఆఫ్ స్పైసెస్'గా ప్రసిద్ధి చెందిన మహాశయ్ ధరంపాల్ గులాటీ ఒకరు. ఈ వ్యాపార వేత్త గురించి తెలియని వారు చాలా తక్కువే.
కష్టపడితే ఫలితం మనదే అని పెద్దలు ఊరికే అనలేదు. ఇలా కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారిలో ఒకరు ఎండీహెచ్ మసాలా యజమాని. ఎండిహెచ్ (మహషియాన్ డి హట్టి ప్రైవేట్ లిమిటెడ్) ఒక భారతీయ సుగంధ ద్రవ్యాల సంస్థ. ఈ సంస్థను స్థాపించిన మహాశయ్ ధరంపాల్ గులాటీ తన జీవితంలో మొదటి 25 సంవత్సరాలు పాకిస్తాన్ లో గడిపాడు. కానీ ఇప్పుడు అతని మసాలా వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇతను 2019 లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు కూడా.
ఎవరీ మహాశయ్ ధరంపాల్ గులాటి
గులాటి 1923 మార్చి 27న పాకిస్థాన్ సియాల్ కోట్ లో జన్మించాడు. ఇతని తండ్రి మహాశయ్ చున్నీ లాల్ గులాటి, తల్లి మాతా చనన్ దేవి. ఇతను పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలు పాకిస్తాన్ లో గడిపాడు. అయితే ఇతనికి చదువు అంతగా అబ్బలేదు. చదువుపై తక్కువ ఆసక్తి చూపేవాడు. అందుకే ఇతను ఐదో తరగతిలోనే స్కూల్ మానేశాడు. అయితే ఇతని తండ్రి మహాషియాన్ డి హట్టి (ఎండిహెచ్) పేరుతో సుగంధ ద్రవ్యాల దుకాణాన్ని నడిపేవాడు. స్కూల్ మానేసిన ధరంపాల్ గులాటి తండ్రికి సహాయం చేస్తూ అక్కడే ఉండేవాడు.
వ్యాపారం ఎలా స్టార్ట్ అయ్యింది
undefined
ఎండీహెచ్ వ్యవస్థాపకుడు అతని తండ్రి మహాశయ్ చున్నీ లాల్ గులాటి. స్కూల్ మానేసిన తర్వాత గులాటీ తన తండ్రికి మసాలా దుకాణంలో సహాయంగా ఉండేవాడు. మొదట్లో మెహందీని అమ్మి రోజుకు రూ.20 సంపాదించేవాడు. 1947లో దేశవిభజన సమయంలో ఆయన కుటుంబం భారతదేశానికి వలస వెళ్లాలని నిర్ణయించుకుంది. అమృత్ సర్ లోని శరణార్థుల శిబిరంలో వీరి కుటుంబం కొంతకాలం గడిపింది. ఆ తర్వాత ఢిల్లీకి మకాం మార్చారు. మొదట్లో కరోల్ బాగ్ లోని తన మేనకోడలు ఇంట్లో ఉండేవారు. అయితే ఆ ఇంటికి కరెంటు, నీటి సరఫరా, మరుగుదొడ్డి సౌకర్యం కూడా ఉండేవి కావు.
ధరంపాల్ గులాటీ 1941లో తన 18వ ఏట లీలావతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు సంజీవ్ గులాటి, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే లీలావతి 1992 లో మరణించారు. ఒక 2 నెలల తర్వాత అతని కుమారుడు కూడా మరణించాడు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రయాణం
పాకిస్తాన్ లో స్కూల్ మానేసిన తర్వాత ధరంపాల్ గులాటీ వడ్రంగి, చిత్రలేఖనం, ఎంబ్రాయిడరీ వంటి ఎన్నో హస్తకళలను నేర్చుకున్నాడు. కాని వీటిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత అతని తండ్రి అతడిని తన మసాలా దుకాణంలో చేర్చుకున్నాడు. వీరి కుటుంబం వలస వెళ్లేసమయంలో అతని జేబులో కేవలం రూ.1500 మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బుతో రూ.650 విలువ చేసే గుర్రపు బండిని కొన్నాడు. కన్నాట్ ప్లేస్ నుంచి కరోల్ బాగ్ వరకు ప్రయాణికులను తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత దీన్ని అమ్మేశాడు. 1948 లో అతను తన సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడానికి కరోల్ బాగ్లో ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించాడు. 1953లో చాందినీ చౌక్ లో రెండో దుకాణాన్ని అద్దెకు తీసుకున్నాడు. 1959 లో "డెగ్గీ మిర్చ్ వాలే" నినాదంతో మహాషిన్ డి హట్టి తయారీ యూనిట్ ను స్థాపించడానికి అతను న్యూఢిల్లీలోని కీర్తి నగర్ లో భూమిని కొన్నాడు.
మసాలా దినుసుల రారాజు
ఈయన సుగంధ ద్రవ్యాల మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో విస్తరించింది. 2017లో భారత్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సీఈఓగా ఈయన నిలిచారు. ఈయన చనిపోయి రెండేండ్లు గడుస్తున్నా.. ఈయన పేరు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.
2019లో మహాశయ్ ధరంపాల్ గులాటీకి పద్మభూషణ్ పురస్కారం లభించింది. మహాశయ్ చున్నీలాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన దాదాపు 90 శాతం విరాళాలు ఇచ్చేవాడు. ఈ ట్రస్ట్ ఢిల్లీలో 250 పడకల ఆసుపత్రితో పాటు నాలుగు పాఠశాలలు, మురికివాడల నివాసితుల కోసం ఒక సంచార ఆసుపత్రిని నిర్వహిస్తుంది. 2016లో ఏబీసీఐ వార్షిక అవార్డుల్లో 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్'గా ఈయన ఎంపికయ్యారు. 2017లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ గా "ఎక్సలెన్స్ అవార్డు" కూడా అందుకున్నాడు.
మహాశయ్ ధరంపాల్ గులాటీ భారతదేశ శక్తిపై ప్రపంచానికి నమ్మకం కలిగేలా చేశారు. గులాటీ చూపిన సంకల్పం, కృషి అసాధారణమైనవి, స్ఫూర్తిదాయకమైనవి. వైఫల్యాలను అధిగమించి అన్ని అడ్డంకులను అధిగమించి విజయం సాధించాడు. మహాశయ్ ధరంపాల్ గులాటీ చాలా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి.. గొప్ప పారిశ్రామిక వేత్తగా ఎదిగాడు. 96 ఏళ్ల వయసులోనూ ఆయన ఏ యువ పారిశ్రామికవేత్తకు ఏ మాత్రం తీసిపోలేదు.