
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమానికి ఎంత విశేష ఆదరణ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు. అలాగే పర్యావరణం, పరిశుభ్రత, వివిధ సామాజిక సమస్యలు మొదలైన అనేక అంశాలను ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ప్రతిష్టాత్మక మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీన 100వ ఎపిసోడ్‌కు చేరుకుంటుంది. ఈ క్రమంలోనే దేశం మొత్తం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
అయితే మన్ కీ బాత్ రెడియో కార్యక్రమం కావడంతో కేవలం ప్రధాని మోదీ వాయిస్ మాత్రమే జనాలకు వినిపిస్తుంది. మోదీ ఎక్కడ కూర్చొని ప్రసంగిస్తారు?, ఈ కార్యక్రమం రికార్డింగ్ ఎలా చేస్తారు? వంటి విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే మొదటిసారిగా ప్రధాని మోదీ మన్ కీ బాత్‌కు సెట్‌కు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
ఈ వీడియోలో ప్రధాని మోదీ తొలుత మన్ కీ బాత్ రికార్డు చేస్తున్న బృందం వద్దకు వెళ్లి మాట్లాడటం కనిపిస్తోంది. అనంతరం ప్రధాని మోదీ ఒక గదిలోకి వెళ్లి మైక్ ముందు మాట్లాడటం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. 'మన్ కీ బాత్' ఆల్ ఇండియా రేడియో ద్వారా 22 భారతీయ భాషలు, 29 మాండలికాలు, 11 విదేశీ భాషల్లోకి అనువదించబడుతుంది.
ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఈ సందర్భం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌కు చేరుకున్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖులే విదేశాలకు చెందినవారు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.