
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం రోజున మావోయిస్టులు జరిపిన పేలుడులో 10 మంది పోలీసులు, వారు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ప్రకటించారు. భద్రతా బలగాలు మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రతీకార దాడిలో భాగంగానే దాడి చేశామని వెల్లడించారు. మావోయిస్టు సెంట్రల్ బ్యూరో పేరుతో లేఖ విడుదల చేశారు.
ఇక, దంతేవాడలోని అరన్‌పూర్ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం అందుకున్న జిల్లా రిజర్వ్ గార్డ్‌కు(డీఆర్‌జీ) చెందిన పోలీసులు బుధవారం కూబింగ్‌కు బయలుదేరింది. ఆపరేషన్ ముగించుకుని అద్దెకు తీసుకొచ్చిన ప్రైవేట్ వ్యానులో వారు క్యాంప్ కు బయలుదేరారు. ఈ క్రమంలో ఆరన్ పూర్ గ్రామం దాటిన మినీ వ్యాన్ పై మావోయిస్టులు దాడి చేశారు. రోడ్డు కింది భాగంలో అమర్చిన ఇంప్రొవైజ్డ్ఎక్స్ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)ను పేల్చేశారు. ఈ దాడిలో 10 మంది పోలీసులు, వ్యాన్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మినీ వ్యాన్ గాల్లోకి ఎగిరిపడి ముక్కలైంది.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడిలో మరణించిన 10 మంది పోలీసుల్లో ఐదుగురు గతంలో యాక్టివ్ నక్సల్స్..!!
అయితే ఈ దాడిలో మొత్తంగా 11 మంది ప్రాణాలను బలిగొన్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) కనీసం రెండు నెలల క్రితమే నక్సల్స్‌చే అమర్చబడిందని పోలీసులు తెలిపారు. రెండు నెలల క్రితం సొరంగం తవ్వి ఫాక్స్‌హోల్ మెకానిజం ద్వారా ఐఈడీని అమర్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రోడ్డు కింద మూడు నాలుగు అడుగుల మేర పాతిపెట్టి ఉండడంతో మందుపాతర నిర్మూలన సమయంలో గుర్తించలేకపోయామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.