హింసాత్మక ఘర్షణలతో మణిపూర్ మండిపోతోంది. రెండు వర్గాల మధ్య మొదలైన ఈ గొడవతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందకు రాష్ట్ర ప్రభుత్వం అనేక జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
మణిపూర్ లో చెలరేగుతున్న హింసపై భారత బాక్సింగ్ సూపర్ స్టార్ మేరీకోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ల సహాయం కోరారు. ‘‘నా రాష్ట్రం మణిపూర్ మండుతోంది, దయచేసి సహాయం చేయండి’’ అంటూ ప్రధాని మోడీ, అమిత్ షాలను ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు.
ఘోరం.. రూ. 8 వేలు దొంగలించారనే అనుమానంతో కాలేజీ విద్యార్థినుల బట్టలు విప్పించిన హాస్టల్ వార్డెన్..
కర్ఫ్యూ, ఇంటర్నెట్ నిలిపివేత
గిరిజనుల ఆందోళన సందర్భంగా హింస చెలరేగడంతో మణిపూర్ ప్రభుత్వం బుధవారం ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. గిరిజనేతరులు అధికంగా ఉండే ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, తౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతో పాటు గిరిజనులు అధికంగా ఉండే చురచంద్పూర్, కాంగ్పోక్పి, తెంగ్నౌపాల్ జిల్లాల్లో దీనిని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
My state Manipur is burning, kindly help pic.twitter.com/VMdmYMoKqP
— M C Mary Kom OLY (@MangteC)దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ శక్తుల కుట్ర, కార్యకలాపాలను అడ్డుకోవడానికి, శాంతి, మత సామరస్యాన్ని కాపాడటానికి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు, ప్రాణాలకు నష్టం జరకుండా చూసేందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని పేర్కొంటూ హోమ్ శాఖ కమిషనర్ హెచ్ జ్ఞాన్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వివిధ సామాజిక వేదికల ద్వారా తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తిని నిరోధించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.
అసలేం జరిగిందంటే ?
షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం గిరిజనేతర మీటీలు డిమాండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్ యూఎం) ‘ట్రైబల్ సాలిడారిటీ మార్చ్’కు పిలుపునిచ్చింది. చురాచంద్పూర్ జిల్లాలోని తోర్బంగ్ ప్రాంతంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. ఈ మార్చ్ లో వేలాది మంది గిరిజనులు కవాతులో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మెయిటీ కమ్యూనిటీకి ఎస్టీ హోదాను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ పరిణామం టోర్బంగ్ ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసకు దారితీసింది. ఈ ఘర్షణను అదుపులోకి తీసుకొచ్చేందుకు, జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు పలు రౌండ్ల బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. టెంగ్నౌపాల్, చందేల్, కాంగ్పోక్పి, నోనీ, ఉఖ్రూ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు.
హింసాత్మక ప్రాంతాల్లోకి సైన్యం బలగాలు..
రాష్ట్రంలోని అన్ని హింసాత్మక ప్రాంతాల్లో భారత సైన్యం తన బలగాలను మోహరించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటోంది. ‘‘మణిపూర్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ అభ్యర్థనపై స్పందించిన ఆర్మీ / అస్సాం రైఫిల్స్ వెంటనే మే 3 సాయంత్రం అన్ని ప్రభావిత ప్రాంతాలలో దళాలను మోహరించింది. ఎక్కువ మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి చర్యలు కొనసాగుతున్నాయి’’అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. హింసాత్మక ప్రాంతాల్లో సైన్యం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది.