షారూఖ్ ఖాన్‌ను బలిపశువు చేశారు.. మహారాష్ట్రలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలనం

By telugu teamFirst Published Dec 1, 2021, 3:12 PM IST
Highlights

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై విమర్శలు చేస్తూ ఆ పార్టీ వ్యతిరేకులందరినీ ఒక చోటికి చేర్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌ను బలిపశువు చేశారని, దర్శకుడు మహేష్ భట్‌నూ బలిపశువు చేశారని అన్నారు. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసు గురించి ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్యనాథ్ ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌లతో ఆమె భేటీ అయ్యారు. మంగళవారం ఆమె జై మరాఠా, జై బంగ్లా అనే కొత్త నినాదాన్ని ఇచ్చారు. కాంగ్రెస్సేతర విపక్ష కూటమికి టీఎంసీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
 

ముంబయి: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(TMC) భారీ విజయం నమోదు చేసిన తర్వాత రాష్ట్రం వెలుపలా బలపడాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఇటీవలే త్రిపుర స్థానిక ఎన్నికల్లో పోటీ చేసింది. ఆశించిన ఫలితాలు రాబట్టలేక భంగపడ్డది. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు టీఎంసీ బలపడే అవకాశాలైతే ఉన్నాయి. కాగా, గోవాలోనూ పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నది. ఇదే క్రమంలో టీఎంసీ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) మూడు రోజుల మహారాష్ట్ర(Maharashtra) పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలోనూ BJPపై విమర్శలు చేశారు. Shivsena, ఎన్‌సీపీతో సఖ్యత కోరుకుంటున్నట్టు ఆమె పేర్కొన్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌ను బలిపశువు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ రోజు మహారాష్ట్రలో అన్నారు. బీజేపీ క్రూరమైన అప్రజాస్వామిక పార్టీ అని ఆరోపణలు చేశారు. భారత్ మ్యాన్‌ పవర్‌ను ఇష్టపడుతుందని, కానీ మజిల్ పవర్‌ను కాదని పేర్కొన్నారు. బీజేపీ రూపంలో అందరూ క్రూరమైన, అప్రజస్వామిక పార్టీని ఎదుర్కొంటున్నారని వివరించారు. అందరూ కలిసి ఐక్యం అయితే విజయం సాధ్యమవుతుందని అన్నారు. 

Also Read: కాంగ్రెస్ వర్సెస్ టీఎంసీ.. పార్లమెంటులో హస్తం పార్టీతో కలువం.. ఆధిపత్య పోరుకు బీజం?

మహేష్‌జీ(దర్శకుడు మహేష్ భట్)ని బలిపశువు చేశారని, షారూఖ్ ఖాన్‌ను కూడా బలిపశువు చేశారని మమతా బెనర్జీ అన్నారు. ‘మనం గెలవాలంటే వీలైన చోటల్లా గళం ఎత్తాల్సిందే, పోరాడవల్సిందే. మీరు మాకు సలహాలు, సూచనలు ఇవ్వండి’ అని బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్లను ఒక గాటన కట్టే ప్రయత్నం చేశారు. 

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో మమతా బెనర్జీ భేటీ కావాల్సి ఉంది. కానీ, ఆయన అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండటంతో అది సాధ్యపడలేదు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు బదులు క్యాబినెట్ మినిస్టర్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌లతో ఆమె భేటీ అయ్యారు. నేడు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ కానున్నారు. 

ఆమె తన మహారాష్ట్ర పర్యటనలో రబీంద్రనాథ్ ఠాగూర్‌.. ఛత్రపతి శివాజీపై రాసిన ఓ పోయెమ్‌ను చదివి వినిపించారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె మంగళవారం సిద్ధి వినాయక్ ఆలయాన్ని దర్శించారు. తన నివాసంలో తాను వినాయకుడికి పూజలు నిర్వహిస్తారని అన్నారు. మహారాష్టకు తాను ఎన్నోసార్లు వచ్చారని, కానీ, సిద్ధి వినాయక ఆలయానికి రాలేదని తెలిపారు. సిద్ధి వినాయకుడి పూజలో తాను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నట్టు వివరించారు. ఇదే సందర్భంగా ఆమె జై మరాఠా, జై బంగ్లా అనే కొత్త నినాదాన్ని పలికారు.

Also Read: Mamata Banerjee: ప్రతిసారీ సోనియా గాంధీని ఎందుకు కలవాలి?.. దీదీ కామెంట్స్.. పెద్ద హింటే ఇచ్చేశారుగా..

మహారాష్ట్రలో వచ్చే ఏడాది స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ సందర్భంగా మమతా బెనర్జీ పర్యటన శివసేనకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మమతా బెనర్జీ పర్యటనతో మహారాష్ట్రలోని బెంగాలీల ఓట్లు తమకే పడతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, యూపీ, బిహార్, బెంగాల్ నుంచి మహారాష్ట్రకు వలస వచ్చిన ముస్లిం ఓట్లూ శివసేనకు పడే అవకాశం ఉన్నదనీ అంచనాలు ఉన్నాయి.

click me!