కాంగ్రెస్ వర్సెస్ టీఎంసీ.. పార్లమెంటులో హస్తం పార్టీతో కలువం.. ఆధిపత్య పోరుకు బీజం?
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీఎంసీల మధ్య దూరం పెరుగుతున్నది. లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేస్తేనే బీజేపీని ఎదుర్కోగలవనే విశ్లేషణలు ఉన్నప్పటికీ జనరల్ ఎలక్షన్స్ కాదు కదా.. పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ రెండు పార్టీల కలిసి ప్రభుత్వంపై పోరాడే పరిస్థితులు లేవని తెలుస్తున్నది. పార్లమెంటులో కాంగ్రెస్ సమన్వయం చేసే కార్యక్రమాల్లో తాము పాల్గొనబోమని, ఆ పార్టీ 29న నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికీ హాజరు కావడం లేదని టీఎంసీ నేత ఒకరు చెప్పి సంచలనానికి తెరతీశారు.
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నిక(General Elections)ల్లో విపక్షాలన్నీ(Opposition) ఐక్యమవుతాయా? Narendra Modi సారథ్యంలోని BJPని ఎదుర్కొంటాయా? అనే చర్చ ఈ మధ్యే కొంత మొదలైంది. ప్రతిపక్ష పార్టీలన్నీ కలవడం సాధ్యపడదని చాలా మంది వాదించినా.. ఈ సారి కలుస్తాయనే చర్చ కూడా వినిపించింది. సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం మాట అటుంచితే.. ఎల్లుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లోనే ప్రతిపక్షాల మధ్య ఐక్యత పొసగడం లేదని స్పష్టమవుతున్నది. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తాము కాంగ్రెస్‌తో సమన్వయం చేసుకుని పోరాడాలని భావించడం లేదని టీఎంసీ శనివారం వెల్లడించింది. Congressతో కలవడానికి విముఖంగా ఉన్నట్టు TMC నేత ఒకరు తెలిపారు.
అంతేకాదు, ఈ నెల 29న కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరుకాబోమని ఆ నేత వివరించారు. అయితే, అదే రోజున పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సారథ్యంలో పార్లమెంటులో చేపట్టాల్సిన వ్యూహంపై చర్చిస్తామని, లేవనెత్తాల్సిన అంశాలపై మాట్లాడుకుంటామని తెలిపారు. దీంతో టీఎంసీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు పరాకాష్టకు చేరినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, కాంగ్రెస్ పొజిషన్‌ను టీఎంసీ ఆక్రమించే వ్యూహం కూడా స్పష్టం అవుతున్నది. దీనికి ఈ పార్లమెంటు సమావేశాల్లోనూ బీజం పడే అవకాశముంది.
Also Read: టార్గెట్ 2024: కాంగ్రెస్‌కు కత్తిమీద సామేనా? బలపడ్డ స్థానిక పార్టీలు.. అపోజిషన్ యూనిటీ వట్టిమాటేనా?
ఈ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ టీఎంసీ సహా అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వాన్ని ఎదుర్కొంటుందని మల్లికార్జున్ ఖర్గే ఇటీవలే వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు సవాల్‌గా టీఎంసీ నేత ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. తాము కాంగ్రెస్‌తో కలిసి పోరాడే ప్రసక్తే లేదని వివరించారు. ఆ పార్టీ సమన్వయం చేసే కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోబోమని తెలిపారు.
అంతేకాదు, ముందు కాంగ్రెస్ పార్టీ తన గూటిని చక్కబెట్టుకోవాలని సూచనలు చేశారు. పార్టీ అంతర్గత సమన్వయాన్ని ముందు మంచిగా చేసుకోవాలని, ఆ తర్వాత ఇతర ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేయడంపై ఫోకస్ పెట్టాలని అన్నారు. కాగా, మరి ఇతర ప్రతిపక్ష పార్టీలతో టీఎంసీ సమన్వయంలో ఉంటుందా? అనే ప్రశ్నలు ముందుకు వచ్చాయి. తాము ప్రజా సమస్యలను, ప్రజా హిత సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామని ఆ నేత అన్నారు. అంతేకాదు, ఈ విషయంలో తాము ఇతర పార్టీలతోనూ కలిసి సమన్వయం చేసుకుంటామని వివరించారు. కాంగ్రెస్‌తో ఎందుకు చెడిందనే విషయంపైనా సదరు నేత స్పందించారు. కాంగ్రెస్ నేతలు బీజేపీని ఎదుర్కోవాలనే లక్ష్యాన్నే నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
Also Read: Farm Laws: సాగు చట్టాల రద్దు నిర్ణయం.. ఎన్నికల్లో విపక్షాలకు కలిసి వస్తుందా?
పార్లమెంటులో టీఎంసీ లేవనెత్తే అంశాలను ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ వివరించారు. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై చట్టం, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ పొడిగింపు, బీఎస్‌ఎఫ్ పరిధి పెంపు, సమాఖ్య నిర్మాణాన్ని అస్థిరపరిచే చర్యలు, చమురు ధరల పెరుగుదల, బ్యాంకుల ప్రైవేటీకరణ సహా పలు అంశాలను తాము పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవడం లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నది. బీజేపీని ఎదుర్కోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని, బీజేపీని ఎదుర్కొనే సామర్థ్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదని తీవ్ర విమర్శలు చేసింది. ఇటీవలే మమతా బెనర్జీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై ఘాటు విమర్శతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు మరింత దిగజారిపోయాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు కదా అని గుర్తు చేస్తూ ఆ ఓటమిని ట్విట్టర్ ట్రెండింగ్ ద్వారా చెరిపేస్తారా? అంటూ విమర్శలు చేశారు. అంతేకాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సరైన ప్రత్యర్థి రాహుల్ గాంధీ కాదని, మోడీకి సరైన ప్రత్యర్థిగా మమతా బెనర్జీ ఎదిగారని టీఎంసీ మౌత్ పీస్ జాగో బంగ్లా కథనం ప్రచురించడం వంటి విషయాలు ఈ రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచాయి.