రేపు హైదరాబాద్‌కు మల్లికార్జున ఖర్గే.. రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనున్న కాంగ్రెస్ అధ్యక్షుడు..

By Sumanth KanukulaFirst Published Oct 31, 2022, 3:09 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రేపు (నవంబర్ 1) హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్‌లో సాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మల్లికార్జున ఖర్గే పాల్గొనబోతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రేపు (నవంబర్ 1) హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్‌లో సాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మల్లికార్జున ఖర్గే పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ వెల్లడించారు. రేపు ఉదయం 8 గంటలకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకోబోతున్నట్టుగా చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రేపు సాయంత్రం మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని తెలిపారు. 

ఇక, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపు హైదరాబాద్‌లోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతుంది. ఈరోజు పాదయాత్ర ప్రారంభించడానికి ముందు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరా గాంధీ వర్దంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. గుజరాత్‌లోని మోర్బి సస్పెన్షన్ బ్రిడ్జి దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం 2 నిమిషాలు మౌనం పాటించారు.

ఈరోజు రాహుల్ పాదయాత్ర ముచ్చింతల్ వరకు కొనసాగనుంది. రాహుల్ ఇవాళ దాదాపు 28 కిలోమీటర్ల మేర నడవనున్నారు. రాత్రికి శంషాబాద్ తొండుపల్లి వద్ద రాహుల్ బస చేయనున్నారు. ఇక, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మంగళవారం హైదరాబాద్‌లోకి ప్రవేశించనుంది. చారిత్రాత్మక చార్మినార్‌ను రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు.  సాయంత్రం నెక్లెస్ రోడ్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ సభలో మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

click me!