
National Unity Day: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నివాళులర్పించారు. ఈ క్రమంలోనే ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారనీ, అలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశం గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం ఆదివారం నాటి మోర్బీ వంతెన కూలిన ఘటనలో మరణించిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ప్రధాని ర్యాలీ నిర్వహించాల్సి ఉంది.
అయితే, మోర్బీ వంతెన కూలిన ఘటనతో ఏకంగా 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అహ్మదాబాద్‌లో జరగనున్న రోడ్‌షోతో సహా తన కార్యక్రమాలను ప్రధాని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. మోర్బీ వంతెన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో నిమగ్నమైందని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. దేశ రాజధానిలో ఢిల్లీలోని పటేల్ చౌక్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా న్యూఢిల్లీలో పటేల్‌కు నివాళులర్పించారు. ఈక్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని విభజించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించినా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తన దూరదృష్టితో బలమైన, అఖండ భారత కలను సాకారం చేశారన్నారు. రాబోయే 25 ఏళ్లలో, భారతదేశాన్ని బలమైన, సంపన్న దేశంగా మార్చాలనే దేశ స్వాతంత్ర్య సమరయోధుల కలను భారతదేశం సాకారం చేయగలదనీ, ఈక్రమంలోనే దాని 100వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోగలదని అమిత్ షా అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. సర్దార్ పటేల్ కు నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా "సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కుపాదం భారతదేశాన్ని ఏకం చేసింది. ఆయన వెలిగించిన ఐక్యతా జ్వాల మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా ప్రకాశించేలా చేయడమే ఆయనకు అత్యంత సముచితమైన నివాళి" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.