నా భార్యకు హెచ్ఐవీ ఉన్నది.. విడాకులు ఇవ్వండని కోర్టుకెక్కిన వ్యక్తి.. హైకోర్టు ఏమన్నదంటే?

By Mahesh KFirst Published Nov 24, 2022, 5:16 PM IST
Highlights

తన భార్యకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నదని ఆ వ్యక్తి కోర్టుకు ఎక్కి విడాకులు కావాలని కోరాడు. కానీ, ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్టు నిరూపించలేకపోయాడు. రిపోర్టులోనూ హెచ్ఐవీ లేదనే తేలింది. దీంతో హైకోర్టు ఆయన విడాకుల పిటిషన్‌ను కొట్టేసింది.
 

న్యూఢిల్లీ: నా భార్యకు హెచ్ఐవీ ఉన్నది. విచిత్రంగా ప్రవర్తిస్తున్నది. మొండిగా వ్యవహరిస్తున్నది. చికాకు ఎక్కువ. తొందరగా కోపగించుకుంటున్నది. నాతోని, నా కుటుంబ సభ్యులతో సఖ్యంగా మసులుకోవట్లేదు. దయచేసి ఆమెతో నాకు విడాకులు ఇప్పించండి.. అంటూ ఓ వ్యక్తి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. 2011లో విడాకుల పిటిషన్ వేశాడు. కానీ, ఫ్యామిలీ కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో బొంబాయ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇక్కడ ఆయన పిటిషన్ తిరస్కరణకు గురైంది.

ఆమెను మార్చి 2003లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెకు కొన్ని రకాల వ్యాధులు సోకాయని చెప్పాడు. వాటిని టెస్టు చేస్తుండగానే 2005లో ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలిందని వివరించాడు. హెచ్ఐవీ పాజిటివ్ కారణంగా సమాజంలో తాను తల ఎత్తుకుని జీవించలేకపోతున్నానని చెప్పాడు.

Also Read: షాకింగ్.. డాసనా జైల్లో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్..

జస్టిస్ నితిన్ జామదార్, జస్టిస్ శర్మిలా దేశ్‌ముఖ్‌ల డివిజన్ బెంచ్ 2011లో దాఖలు చేసిన పిటిషన్‌ను నవంబర్ 16న ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది. పిటిషనర్‌కు మానసిక క్షోభ కలిగించడానికి కారణమైన తన భార్యకు హెచ్‌ఐవీ పాజిటివ్ రిపోర్టును సమర్పించనేలేదని వివరించింది. తన భార్యకు హెచ్ఐవీ ఉన్నదన్నట్టుగా ఆయన నిరూపించలేకపోయాడని తెలిపింది. అందుకే ఆయన విడాకుల పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు పేర్కొంది.

తన భార్యకు హెచ్ఐవీ ఉన్నట్టు చెప్పడానికి ఏ మాత్రం ఆధారం కూడా చూపెట్టలేకపోయిందని హైకోర్టు తెలిపింది. హెచ్ఐవీ ఉన్నదన్న కారణంగా మానసిక క్షోభ, వ్యధను అనుభవించానని పిటిషనర్ వాదించాడని, కానీ, అసలు ఆమెకు హెచ్ఐవీ ఉన్నదనే విషయాన్ని కొంతైనా నిరూపించలేకపోయాడని కోర్టు స్పష్టం చేసింది. హెచ్ఐవీ రిపోర్టు కూడా నాట్ డిటెక్టెడ్ (హెచ్ఐవీ లేదని) అని చూపినా పిటిషనర్ ఆమెతో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదని కోర్టు తెలిపింది. అంతేకాకుండా అతని బంధువులు, మిత్రులు, సోసైటీలోనూ తన భార్యకు హెచ్ఐవీ ఉన్నదని చెప్పడం మూలంగా రెస్పాండెంట్‌కే మానసిక వ్యధ కలిగించారని వివరించింది. హెచ్ఐవీ లేకున్నా.. ఉన్నదని అబద్ధాలాడి విడాకులు తీసుకోజూసిన పిటిషనర్ డైవర్స్ పిటిషన్ కొట్టేస్తున్నట్టు హైకోర్టు తీర్పు ఇచ్చింది.

click me!