
Pahalgam Terrorist Attack : ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినవారిలో ఆరుగురు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించివారి కుటుంబాలను మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది... ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ ఆర్థిక సాయం ప్రకటించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు ముఖ్యమంత్రి పడ్నవీస్. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబాలకు విద్య, ఉపాధిలో సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఉగ్రవాదుల చేతిలో మరణించిన జగ్దాలే కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఇదిలాఉంటే పహల్గాం ఉగ్రదాడి తర్వాత శ్రీనగర్‌లో చిక్కుకున్న మహారాష్ట్ర పర్యాటకులను తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 500 మంది పర్యాటకులు మహారాష్ట్రకు తిరిగి వచ్చారు. అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శ్రీనగర్‌ను సందర్శించి పర్యాటకులను కలిశారు. గిరీష్ మహాజన్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర సైనికులను కలిశారు.