
Kashmir : బారతదేశంలో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది. పహల్గాం దాడి మాదిరిగానే కశ్మీర్ లో ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిస్తున్నారు. దీంతో కశ్మీర్ లో టూరిస్టులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది. టూరిజం ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసింది.
మంచుకొండలు, పచ్చని అడవులు, నీటి ప్రవాహాలు, ప్రకృతి అందాలతో నిండివుంటుంది కశ్మీర్. దీంతో ఈ అందాలను చూసేందుకు భారత నలుమూలల నుండి పర్యాటకులు తరలివస్తుంటారు. ఇలా మినీ స్విట్జర్లాండ్ గా పిలుచుకునే పహల్గాంలోని బైసరన్ వ్యాలీ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్ట్ లపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడిచేసారు. కేవలం హిందువులే టార్గెట్ గా మారణహోమం సృష్టించారు. దీంతో కశ్మీర్ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
అయితే ఇప్పుడు కశ్మీర్ లోని మిగతా పర్యాటక ప్రదేశాలకు ఉగ్రవాద ముప్పు పొంచివుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం టూరిస్ట్ ప్రాంతాలకు పర్యాటకుల అనుమతి నిలిపివేసింది. కశ్మీర్ లో 80కి పైగా టూరిస్ట్ స్పాట్స్ ఉండగా 50 ప్రాంతాలను మూసివేసారు. మిగతాచోట్ల కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసారు.
అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సమ్మర్ లో టూరిస్ట్ లతో కళకళలాడే ప్రాంతాలన్ని ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. దీంతో టూరిజంపై ఆధారపడిన కొందరు కశ్మీరీ ప్రజలకు జీవనాధారం లేకుండాపోయింది. అయితే భద్రతను కట్టుదిట్టం చేసి టూరిజం ప్రాంతాలకు పర్యాటకులను అనుమతిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అప్పుడే పహల్గాం ఉగ్రదాడిని మరిచి కశ్మీర్ కు టూరిస్టులు వెళ్లే అవకాశాలు కనిపించడంలేదు.