మా గుడిసెలు కూలగొట్టారు.. అందుకే పోటీ చేస్తున్నా: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దినసరి కూలీ

By Mahesh KFirst Published Nov 19, 2022, 4:18 PM IST
Highlights

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ లేబర్ పోటికి దిగుతున్నాడు. ఓ పెద్ద హోటల్‌కు దారి కోసం తమ గుడిసెలను నేలమట్టం చేశారని, తమకు న్యాయం జరగడం లేదని పేర్కొంటూ.. తమ మురికివాడ వాసులంతా చందాలు వేసుకుని తనను బరిలో నిలబెట్టారని వివరించాడు. ఆయన రూ.10 వేలను ఒక్క రూపాయి కాయిన్లతో ఈసీకి డిపాజిట్ చేశాడు.
 

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ లేబర్ పోటికి దిగాడు. రాజధాని నగరం గాంధీనగర్‌లో కూల్చేసిన 521 గుడిసెల్లో ఒక గుడిసెలో నివసించిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి రూ. 10 వేల డిపాజిట్ కట్టాడు. ఈ పదివేలనూ రూపాయి కాయిన్లతో ఎన్నిక సంఘానికి పే చేశాడు. ఆ మురికి వాడ ధ్వంసం చేయడంలో తమ గుడిసెలు కోల్పోయిన 521 గుడిసెల నివాసులు తనకు డబ్బులు చందా వేసి ఇచ్చారని ఆ అభ్యర్థి తెలిపాడు.

గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ సమీపంలో ఓ మురికి వాడ ఉండేది. ఆ వీధిలో 521 గుడిసెలు ఉండేవి. వారంతా ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ పొట్టపోసుకునేవారు. అయితే, వారికి సమీపంలో ఓ పెద్ద హోటల్ వెలిసింది. ఆ హోటల్‌కు దారి కోసం ఆ మురికివీధిలోని 521 గుడిసెలను 2019లో కూల్చేశారు. వారిని మరో చోటు పంపించారు. ఇలా గుడిసెలను కూల్చి మరోచోటికి పంపించడం మొదటిసారి కాదు.

Also Read: Gujarat Election: ఒకేరోజు 56 బ‌హిరంగ స‌భ‌లు.. గుజరాత్ బీజేపీ మెగా ఎన్నిక‌ల ప్ర‌చారం

2019లోనూ ప్రభుత్వం దండీ కుటీర్ మ్యూజియం నిర్మించడానికి అక్కడే ఉన్న తమ గుడిసెలను కూల్చేశారని వివరించాడు. ఆ మ్యూజియాన్ని మహాత్మా గాంధీకి అంకితం చేశారు. అక్కడి నుంచి తమను మహాత్మా మందీర్ సమీపానికి తరలించారని చెప్పాడు. ఇప్పుడు మరో చోటకి తరలించారని వివరించాడు. కానీ, అక్కడ తమకు నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం లేదని పేర్కొన్నాడు. కనీసం, తమ బాధలు వినడానికీ ఒక్క రాజకీయ నేత కూడా రావడం లేదని వివరించాడు. అందుకే ఇలా నష్టపోయిన వారంతా కలిసి డబ్బులు సేకరించి తనను పోటీ చేయలని నిర్ణయించారని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ లేబర్‌లందరి తరఫున్ నిలబడ్డ లేబర్ అభ్యర్థే మహేంద్ర పాట్ని. ఈయన గాంధీనగర్ నార్త్ సీట్ నుంచి పోటీ చేస్తున్నాడు.

మహేంద్ర పాట్ని మాట్లాడుతూ, ‘నేను స్వతంత్రంగా పోటీ చేస్తున్నా. రోజువారీ కూలీ కుటుంబానికి చెందినవాడిని. పని చేసుకుంటేనే మా ఇల్లు గడుస్తుంది. అక్కడ 521 గుడిసెలు ఉండేవి. ఓ పెద్ద హోటల్‌కు దారి కోసమని మా గుడిసెలను నేలమట్టం చేశారు. అందులో చాలా మంది ఇప్పుడు ఏ పనీ లేకుండా ఖాళీగా ఉంటున్నారు. మమ్మల్ని సమీపంలోని మరో చోటికి తరలించారు. కానీ, అక్కడ నీటి, విద్యుత్ సౌకర్యం లేదు’ అని వివరించాడు.

Also Read: Gujarat election: ఎన్నికలకు ముందు గుజరాత్ పర్యటనకు రాహుల్ గాంధీ

తమను ప్రభుత్వం ఎంతమాత్రం కనికరించడం లేదని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. తమకున్న చాలా చిన్న డిమాండ్లు, సమస్యలను పరిష్కరిస్తే తాను పోటీ చేయబోనని స్పష్టం చేశాడు. స్థానిక అధికారులు తమను అదే ప్రాంతంలో ఉండాలని బలవంతపెడుతున్నారని వివరించాడు. రోడ్డు పక్కన అమ్ముకోవడానికి, చిన్న వ్యాపారాలు చేయడానికి ఉపయోగించే తోపుడు బండ్లనూ అధికారులు పట్టుకుని రూ. 2,500 నుంచి రూ. 3000 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నాడు. చాలా మంది నేతలు తమ వద్దకు వచ్చి అన్ని సౌకర్యాలు అందిస్తామని చెప్పి ఎన్నికల తర్వాత యధాలాపంగా మరిచిపోతారని ఆవేదన వ్యక్తం చేశాడు. 1990 నుంచి ఇదే తంతు చూస్తున్నామని వివరించాడు.

తమనూ దారిద్ర్య రేఖకు దిగువ జాబితాలో చేర్చాలని కోరాడు. తద్వార ఎవరైనా కాంట్రాక్టర్లు తమను ప్రభుత్వ ఆఫీసుల్లో పనికి తీసుకుంటే పర్మినెంట్ అవడానికి అవకాశం ఉంటుందని వివరించాడు. సరైన వేతనం ఇవ్వాలని, మధ్య దళారులను తొలగించాలనికోరాడు. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి.

click me!