కేరళ : చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. బిడ్డతో తల్లి వీడియో కాల్ .. ‘‘అందరికీ థ్యాంక్స్’’ అంటూ కంటతడి

By Siva Kodati  |  First Published Nov 28, 2023, 5:33 PM IST

కేరళలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల బాలిక అబిగైల్ సారా రెజీ ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది. కిడ్నాపర్లు ఆమెను కొల్లాంలోని ఓ ఆశ్రయంలో వదిలిపెట్టి వెళ్లారు.  తమకు అండగా నిలిచిన మీడియా, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, మతపెద్దలు, కేరళ ప్రజలు సహా ప్రతి ఒక్కరికీ బాలిక తల్లి సీజీ కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు.


కేరళలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల బాలిక అబిగైల్ సారా రెజీ ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది. కిడ్నాపర్లు ఆమెను కొల్లాంలోని ఓ ఆశ్రయంలో వదిలిపెట్టి వెళ్లారు. ప్రస్తుతం పాప క్షేమంగా వున్నట్లు పోలీసులు తెలిపారు. తమ కుమార్తె క్షేమంగా ఇంటికి రావడంతో పాప తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు అండగా నిలిచిన మీడియా, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, మతపెద్దలు, కేరళ ప్రజలు సహా ప్రతి ఒక్కరికీ బాలిక తల్లి సీజీ కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. 22 గంటల పాటు బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో రెజీ ఓయూర్ ఇల్లు విషాదంతో నిండిపోయింది.

ప్రస్తుతం ఏఆర్ క్యాంపులో వున్న చిన్నారిని త్వరలో తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. పాప ఆరోగ్య పరిస్ధితి కూడా బాగానే వుందని పోలీసులు చెప్పారు. సీజీ తన కుమార్తెతో వీడియో కాల్ ద్వారా మాట్లాడింది. అయితే బిడ్డను చూడగానే భావోద్వేగానికి గురైన ఆమె కన్నీటితో మాట్లాడలేకపోయింది. కుమార్తెకు ఫోన్‌లో ముద్దులు ఇస్తూ ఆనందం వ్యక్తం చేసింది. చిన్నారిని విడిచిపెట్టిన అనంతరం నిందితులు పరారైనట్లుగా పోలీసులు నిర్ధారించారు. పాపను గుర్తించిన అనంతరం పోలీసులు ఆమెను కొల్లాం కమీషనర్ కార్యాలయానికి తరలించారు. 24 గంటల పాటు పరిశీలన కోసం చిన్నారిని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో వుంచారు. 

Latest Videos

undefined

ALso Read: BREAKING: కేరళలో చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతం.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు, కాసేపట్లో తల్లిదండ్రుల చెంతకు

నిందితులు ఆశ్రమం ఆవరణలో వదిలివెళ్లిన బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సామాజిక మాధ్యమాల్లో పాప ఫోటోలు వైరల్‌గా మారడంతో ప్రజలు ఆమెను గుర్తించడం సులువైంది. అనంతరం చిన్నారికి నీళ్లు, బిస్కెట్లు అందించారు. మీడియా కవరేజ్, పోలీసుల విచారణ ద్వారా తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో భయపడిన నిందితులు కొల్లాంలోని ఆశ్రమంలో చిన్నారిని వదిలేసినట్లు సమాచారం. అబిగైల్ సారా అనే బాలిక తన ఎనిమిదేళ్ల సోదరుడితో కలిసి ట్యూషన్‌కు వెళుతుండగా దక్షిణ కేరళలోని పూయపల్లిలో నిన్న సాయంత్రం 4:30 గంటలకు ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. 

కిడ్నాపర్లు ఓ తెలుపు రంగు కారులో వచ్చి బాలికను అపహరించుకుపోయారు. కిడ్నాపర్లలో ఓ మహిళ సహా నలుగురు వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారి బారి నుంచి తన సోదరిని కాపాడేందుకు బాలుడు ప్రతిఘటించాడు. అయితే వారు పిల్లాడిని పక్కకు నెట్టేసి ఆమెను కారులో బలవంతంగా తీసుకెళ్లినట్లు పూయపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. 

మరోవైపు.. ఈ కిడ్నాప్ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన డీజీపీని ఆదేశించినట్లుగా సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. బాలిక కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేయవద్దని పినరయి విజయన్ రాష్ట్ర పజలను కోరారు. 
 

click me!