భార్య దేహం ఆస్తి కాదు, అలాంటి సెక్స్ అత్యాచారమే: కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్య

By telugu teamFirst Published Aug 7, 2021, 7:09 AM IST
Highlights

భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధంపై కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్య శరీరం భర్త ఆస్తి కాదని, ఆమెకు ఇష్టం లేని శృంగారం వైవాహిక అత్యాచారం కిందికి వస్తుందని వ్యాఖ్యానించింది.

కొచ్చి: భార్యకు ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందికే వస్తుందని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య దేహాన్ని తన ఆస్తిగా భావించకూడదని స్పష్టం చేసింది. వివాహం, విడాకులు అనేవి లౌకిక చట్టం పరిధిలో ఉండాలని చెప్పింది. వివాహ చట్టంపై మన దేశం పునరావలోకనం చేసుకోవల్సిన సమయం వచ్చిందని చెప్పింది.

క్రూరత్వం ఆరోపణలపై తమకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ ఎ ముహమ్మద్ ముస్తాక్, జస్టిస్ కౌసర్ ఎడప్పగథ్ లతో కూడిన బెంచ్ గత నెల 30వ తేదీన విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేసింది. 

వైవాహిక అత్యాచారాన్ని చట్టంలో శిక్షార్హమైందిగా గుర్తించలేదని, కానీ క్రూరత్వం ఆరోపణలపై విడాకులు మంజూరు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి అది అడ్డు రాదని చెప్పింది. వైవాహిక అత్యాచారం ఆధారంగా విడాకులు కోరడం సమంజసమేమని చెప్పింది. 

భార్య దేహంపై తనకు పూర్తి హక్కులు అన్నాయని భర్త అనుకోవడం, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక చర్యల్లో పాల్గొనడం వైవాహిక అత్యాచారం కిందికే వస్తుందని, ఆధునిక న్యాయ శాస్త్రం భార్యాభర్తలను సమాన హక్కుదారులుగా గుర్తిస్తుందని, భార్యపై భర్తకు ఆధిపత్య హక్కులు ఉండవని కోర్టు చెప్పింది. 

ప్రస్తుత కేసులో డబ్బుపై, శృంగారంపై భర్తకు ఉన్న అత్యాశ వల్లనే భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. విడాకుల మంజూరును సమర్థిస్తూ భర్త అప్పీళ్లను కొట్టేసింది.

click me!