ఎలక్టోరల్ బాండ్ల వివాదం : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు హైకోర్టులో ఊరట

By Arun Kumar PFirst Published Sep 30, 2024, 6:31 PM IST
Highlights

ఎలక్టోరల్ బాండ్ వివాదంలో చిక్కుకుని కేసు కూడా నమోదైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఊరట లభించింది. 

 Electoral Bonds Row : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కాస్త ఊరట లభించింది. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు అనుమానిస్తూ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జెపి నడ్డాతో పాటు మరికొందరిపై కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. తాజాగా ఈ వ్యవహారంలో వీరిపై తదుపరి విచారణను నిలిపివేస్తూ కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది.

నిర్మలా సీతారామన్ పై కేసు ఏమిటి? 

ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అధికంగా లాభపడిన పార్టీ బిజెపియే అనే ప్రచారం వుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారులను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపి విరాళాలను పొందినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

Latest Videos

ఇలా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలోనే కర్ణాటకకు చెందిన జనాధికార సంఘర్ష పరిషత్ ఉపాధ్యక్షుడు ఆదర్శ్ అయ్యర్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసారు. ఎలక్టోరల్ బాండ్ల పేరిట కేంద్రంలో అధికారంలో వున్నవారు తమ పార్టీ బిజెపికి నిధులు దోచిపెట్టారనేది ఈ పిటిషన్ సారాంశం. లోక్ సభ ఎన్నికల్లో ఈ బాండ్ల రూపంలో వేలకోట్లు వసూలు చేసారని ఆరోపించాడు. 

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల కేంద్ర మంత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పోలీసులను ఆదేశించింది. దీంతో నిర్మలా సీతారామన్ ను ఏ1గా, ఈడీని ఏ2గా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఏ3 గా, మాజీ ఎంపీ నళిని కుమార్ ను ఏ4, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రను ఏ5 గా, మరికొందరు బిజెపి నాయకులపై కేసు నమోదు చేసారు. వీరిపై ఐపిసి 384,120బి,34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. 

ఇలా ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశం మేరకు తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ పై బిజెపి నాయకులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర స్టే  విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసిన న్యాయస్థానం అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 

నిర్మలా సీతారామన్ రాజీనామాకు డిమాండ్ 

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో కేసు నమోదుతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జెపి నడ్డా నిందితులుగా మారారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే నిర్మలా సీతారామన్, జెపి నడ్డా కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో కేవలం కేసు నమోదైన కేంద్ర మంత్రులే కాదు అంతకంటే పెద్ద పదవుల్లో వున్నవారి ప్రమేయం వుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. కాబట్టి ఈ కేసు దర్యాప్తు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరగాలని ఆయన డిమాండ్ చేసారు. 

ఇలా పేర్లు పేర్కొనకున్న బిజెపిలోని నంబర్ 1, నంబర్ 2 ల పాత్ర ఈ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో ప్రధానమైందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ను టార్గెట్ చేసారు జైరాం రమేష్. అన్ని పార్టీలకు ఈ బాండ్లు లభించాయి... కానీ బిజెపి మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాండ్లను వసూలు చేసిందని జైరాం రమేష్ ఆరోపించారు.  

అసలు ఏమిటీ ఎలక్టోరల్ బాండ్స్? 

నగదు రూపంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే సంస్కృతిని మారుస్తూ మోదీ సర్కార్ తీసుకువచ్చిన కొత్త విధానమే ఈ ఎలక్టోరల్ బాండ్లు. అంటే సాధారణ పౌరులు, సంస్థలతో పాటు వ్యాపారవేత్తలు ఈ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు ద్వారా తమకు నచ్చిన పార్టీకి విరాళం ఇవ్వవచ్చు. అయితే ఈ విరాళాల విధానాన్ని ఇటీవల సుప్రీంకోర్టు తప్పుబట్టడంతో ఈ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది.  

ఇలా 2017 లో పార్లమెంట్ ఆమోదంతో అమలులోకి వచ్చిన ఈ ఎలక్టోరల్ బాండ్ల విధానం 2014 లో సుప్రీం కోర్టు ఆదేశాలతో నిలిపివేయబడింది.  కానీ ఈ ఏడేళ్లలో కేంద్రంలో అధికారంలో వున్న బిజెపికి ఈ బాండ్ల రూపంలో భారీగా నిధులు అందాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు ఇతర జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు పొందాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏ పార్టీకి ఎవరి నుండి ఎంత విరాళాలు అందాయో మొత్తం వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బైటపెట్టింది. 

దీని ప్రకారం బిజెపికి అత్యధికంగా రూ.6,566 కోట్లు ఈ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందాయి. ఇక కాంగ్రెస్ కు రూ.1,123 కోట్లు అందాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్ల విరాళాల్లో తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) మూడో స్థానంలో వుంది.  ఈ పార్టీకి రూ.912 కోట్లు విరాళంగా అందాయి.  

click me!