
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అంగీకరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తమ పార్టీ నాయకులు ఎంతో ప్రయత్నించామని అన్నారు. కానీ గెలువలేకపోయామని చెప్పారు. ఈ ఫలితాలను విశ్లేషించుకొని, లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్.. వెనుకంజలో ఐదుగురు మంత్రులు..ఎవరెవరంటే?
‘‘ప్రధాని, బీజేపీ కార్యకర్తలు ఎంత ప్రయత్నించినా మేం ఆ ముద్ర వేయలేకపోయాం. కాంగ్రెస్ విజయవంతంగా ఆ పని పూర్తి చేసింది. పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చిన తర్వాత మేము సమగ్ర విశ్లేషణ చేస్తాం. జాతీయ పార్టీగా వివిధ స్థాయిల్లో ఎలాంటి లోటుపాట్లు, అంతరాలు మిగిల్చాయో విశ్లేషించుకుంటాం. ఈ ఫలితాన్ని మా పురోగతిలో తీసుకుంటాము. లోక్ సభ ఎన్నికల్లో తిరిగి రావడానికి ఈ ఫలితాన్ని మేం పరిగణిస్తాం’’ అని కర్ణాటక సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై మీడియాతో అన్నారు.
ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలోనే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాతున్న సమయంలో కాంగ్రెస్ 128 స్థానాల్లో ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. బీజేపీ కేవలం 66 స్థానాల్లో ముందంజలో ఉంది. పూర్తి స్థాయి ఫలితాలు వెలువడి, ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటన వెలువరించేందుకు మరి కొన్ని గంటల సమయం పట్టేలా కనిపిస్తోంది.
ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ బీజేపీ ఆఫీసులో పాము కలకలం.. సీఎం ఉండగానే గందరగోళ పరిస్థితి.. (వీడియో)
ఇదిలావుండగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటింది. ఆ పార్టీ 118 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) ఆదివారం ఉదయం బెంగళూరులో సమావేశం కానుంది. కాగా.. అంతకు ముందు కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ వచ్చినా ఏదీ పనిచేయదని చెప్పాం. 120 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాం. మేం ఊహించినట్లే మెజారిటీ వస్తుంది.’’ అని ధీమా వ్యక్తం చేశారు.
Karnataka Election Results: హనుమాన్ ఆలయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పూజలు..
ఈ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాయి. బెంగళూరు, ఢిల్లీలోని పార్టీ కార్యాలయాల్లో విజయోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో నాయకులు బజరంగ్ బలి నినాదాలు చేశారు. పలవురు హనుమాన్ వేషధారణతో వచ్చారు. మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. హనుమంతుడు తమ పార్టీ వైపే ఉన్నాడని వ్యాఖ్యానించారు.