సిద్ధాంతాల సాకు.. పార్టీలో మొదలైన పోరు: యడియూరప్ప పదవి మూణ్ణాళ్ల ముచ్చటేనా..?

By Siva KodatiFirst Published Sep 15, 2020, 3:11 PM IST
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను మళ్లీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయన ఎన్ని రోజులు ఉంటారనే దానిపై రోజుకో రకమైన విశ్లేషణలు ఊపందుకున్నాయి. 

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను మళ్లీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయన ఎన్ని రోజులు ఉంటారనే దానిపై రోజుకో రకమైన విశ్లేషణలు ఊపందుకున్నాయి. 75 ఏళ్లు నిండిన యడియూరప్ప పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముఖ్య పదవుల్లో కొనసాగరాదన్నది బీజేపీలోని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

యడ్డీ ఎంత త్వరగా తప్పుకుంటే తాము అంత వేగంగా సీఎం కుర్చీపై కూర్చోవాలని అంతర్గతంగా పోరాటం మొదలైనట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆశావహుల్లో కొందరు మాజీ సీఎంలు, సీనియర్ మంత్రులు సైతం ఉన్నారు.

యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించాలని వారు అధిష్టానానికి వినతులు పంపుతున్నారు. ఇటీవల మాజీ సీఎం, ప్రస్తుత మంత్రి జగదీశ్ షెట్టర్ ఢిల్లీ పర్యటన ఉదాహరణగా చెప్పవచ్చు.

సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లో 17వ తేదీన ముఖ్యమంత్రి యడియూరప్ప ఢిల్లీకి వెళ్తున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉంటారని తెలుస్తోంది. వరద సహాయం, కేబినెట్ విస్తరణపై చర్చిస్తారని బయటకు చెబుతున్నా.. తన పదవిని నిలబెట్టుకోవడానికే యడ్డీ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 

click me!