కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యింది. ముందుగా 30 స్థానాల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ.. తమ పార్టీ నుంచి ఇద్దరిని మాత్రమే బరిలోకి దించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీ చేయాలని భావించిన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కేవలం రెండు స్థానాల్లో మాత్రమే తన అభ్యర్థులను బరిలోకి దించింది. కర్ణాటకలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా ముస్లిం, దళిత జనాభా అధికంగా ఉండే సెగ్మెంట్ల నుంచి పార్టీకి పలువురు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. అయినప్పటికీ చివరి నిమిషం వరకు ఎన్నికలకు ముందు పొత్తు కోసం జేడీఎస్ తో చర్చలు జరుగుతుండటంతో పార్టీ నాయకత్వం అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు.
ఏప్రిల్ 20న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు చర్చలు ఫలించలేదు. హుబ్బళి-ధార్వాడ్ తూర్పు స్థానం నుంచి దుర్గప్ప కాశప్ప బిజావాద్, అల్లాబక్ష్ మెహబూబ్ సబ్ బీజాపూర్ నుంచి బసవన బాగేవాడిలను మాత్రమే ఎంఐఎం పోటీకి దించింది. ‘‘జమఖండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం మరో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తోంది’’ అని ఎంఐఎం సీనియర్ నేత ఒకరు తెలిపారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ నామినేషన్ల ఉపసంహరణ ప్రతిపాదనేదీ లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే తమకు పోటీ చేసేందుకు బీ-ఫారాలు ఇవ్వకపోవడంపై ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అస్సాంలో భీకర తుఫాను.. దెబ్బతిన్న 400 నివాసాలు.. ఇళ్లు కూలడంతో ఏడేళ్ల మృతి..
ఎంఐఎం పార్టీకి అనుకూలంగా ఉన్న 30 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టకపోవడానికి మరో కారణం ఒవైసీపై ముస్లిం ఉలేమాల ఒత్తిడి ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయవద్దని, అది బీజేపీకి మాత్రమే లాభిస్తుందని ఒవైసీకి ఉలేమాలు చెప్పారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. బీజేపీ బీ టీమ్ అని వస్తున్న ఆరోపణలు తప్పని ఎంఐఎం నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఒవైసీకి సూచించారు. గుజరాత్ లో కూడా ఒవైసీ నేతృత్వంలోని పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా ఉలేమాలు అడ్డుకున్నారు.
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు..
కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాకటలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న వెలువడింది. మే 10న పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మే 13న చేపట్టనున్నారు.