కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ మొదలుకానుంది. 8.15 గంటలకు తొలి ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా కర్ణాటక పోలీసులు బెంగళూరులో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో కూడా విజయోత్సవ ర్యాలీలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఘర్షణలు జరగకుండా చూసేందుకు పోలీసులు అలెర్ట్ గా ఉన్నారు.
2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారంలో హోరా హోరీగా తలపడ్డాయి. ఓటర్లను తమ వైపు ఆకర్శించుకునేందుకు హామీలను గుప్పించాయి. మే 10వ తేదీన ఎన్నికలు పూర్తయ్యాయి. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచారు. నేడు 224 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఈ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు స్పష్టమైన అడ్వాంటేజ్ ఇచ్చినప్పటికీ వచ్చే 5 సంవత్సరాలకు దక్షిణాది రాష్ట్ర ఓటర్లు ఏం నిర్ణయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా భావించే ఈ రాష్ట్రంలో తొలిసారి సాధారణ మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించాలని అధికార బీజేపీ భావిస్తుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తోంది.కింగ్ మేకర్ గా మారడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాలని జేడీఎస్ భావిస్తోంది.
ఓట్ల లెక్కింపునకు ఇంకా ఒక గంటకు పైగా మాత్రమే సమయం ఉంది. ఉదయం 8:15 గంటలకు తొలి ట్రెండ్ బయటపడే అవకాశం కనిపిస్తోంది. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేసిన 6 ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో 5 సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడుతాయని, జేడీఎస్ కింగ్ మేకర్ గా మారుతుందని అంచనా వేశాయి.