
Karnataka election 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా..పోలీసు శాఖ కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. భారీ ఎత్తున భద్రత బలగాలను మోహరించింది. ఉదయం 11 గంటల వరకల్లా కన్నడ ఓటర్లు ఎవరికి పట్టం కట్టాలని భావించారో తెలుస్తుందనీ, మధ్యాహ్నం వరకు ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా.
కాగా, మొత్తం 224 నియోజకవర్గాలకు గాను ఈ నెల 10న ఎన్నికలు జరగగా.. 73.19 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. అయితే.. కన్నడనాట అధికారం చేపట్టాలంటే..ఏ పార్టీ అయితే.. 113 సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రానుంది. ఏ పార్టీకి సరైన మెజార్టీ కాకపోతే హంగ్ తప్పదు. ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్.. హంగ్ తప్పదని అంచనా వేశాయి. దీంతో తుది ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఇదిలాఉంటే.. కర్ణాటక ఎన్నికలను లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించిన కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల ఫలితాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఈ నేపథ్యంలో ఏ పార్టీకి సరైన మెజార్టీ కాకుండా.. హంగ్ వస్తే.. పరిణామాలు ఎలా ఉండబోతాయనే ఆసక్తి నెలకొంది.
మరోవైపు కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగనున్నదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఆయా పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ కాస్తా ముందంజలో ఉంటుందని, కానీ ఆ పార్టీ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అంచనా వేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమైనట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రతి పార్టీ తన ఎమ్మెల్యేలను చేజారకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్.. గెలిచే ఎక్కువగా అవకాశాలున్న అభ్యర్థులను బెంగళూరుకు రప్పించి ఓ రహస్య ప్రదేశంలో ఉంచినట్టు సమాచారం. ఏదిఏమైనా.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా సాగనున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో జేడీయూ కింగ్ మేకర్ గా నిలువనున్నదని భావిస్తున్నారు. ఇక, ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 116 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 69, జేడీఎస్‌కు 29, బీఎస్పీకి 1, స్వతంత్రులు ఇద్దరు, స్పీకర్ ఒకరు, ఖాళీగా ఉన్న ఆరుగురు (మరణాలు, రాజీనామాలు) ఉన్నారు.