
కాంగ్రెస్ పార్టీతో రెండు దశాబ్ధాల అనుబంధం తెంచుకుని దేశ రాజకీయాల్లో కలకలం రేపారు మధ్యప్రదేశ్ యువనేత జ్యోతిరాదిత్య సింధియా. తాను బీజేపీలోకి చేరడంతో పాటు తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌కు దూరం చేయడంతో కమల్‌నాథ్ సర్కార్ కూలిపోయే ప్రమాదంలో పడింది.
Also Read:సింథియాకు బిజెపి ఆఫర్ ఇదే: మైనారిటీలో కమల్ నాథ్ ప్రభుత్వం
జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడటంపై ఆయన మేనత్త, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పందించారు. సింధియా కాంగ్రెస్‌ను వీడి నానమ్మ కోరిక తీర్చారని వ్యాఖ్యానించారు.
కుటుంబమంతా కలిసి ఉండాలని చనిపోయేముందు తన తల్లి విజయరాజే సింధియా కోరారని వసుంధర గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే తన అన్న మాధవరావు సింధియా పుట్టినరోజు నాడు ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం ద్వారా నానమ్మ కోరిక తీర్చారని ఆమె ప్రశంసించారు.
Also Read:మధ్యప్రదేశ్ క్రైసిస్: 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా
సింధియా బీజేపీలోకి చేరుతున్న క్రమంలో కుటుంబమంతా ఒకే రాజకీయ పార్టీలో ఉండటం తమకు ఆనందాన్ని ఇస్తుందన్నారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు ఎంతో విధేయతతో పనిచేశారని, కానీ ఆ పార్టీ అతనికి సరైన గౌరవం ఇవ్వకపోవడం వల్లనే ఆయన రాజీనామా చేశారని వసుంధర ఆరోపించారు. జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్ రావు రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బీజేపీలోకి అతను రావడం శుభపరిణామమన్నారు.