భారత్‌లోనూ బైడెన్‌లున్నారు.. నాకు లేఖ రాశారు.. మోడీ భేటీలో యూఎస్ అధ్యక్షుడి సరదా సంభాషణ

By telugu teamFirst Published Sep 25, 2021, 5:03 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తొలిసారి ప్రత్యక్షంగా కలిసి మాట్లాడున్న సమావేశం ఫుల్ జోష్‌గా సాగింది. ఇరువురూ జోక్‌లు వేస్తూ ఆహ్లాదకర వాతావరణంలో చర్చించుకున్నారు. ఇండియాలో ఐదుగురు బైడెన్‌లు ఉన్నారని, తాను తొలిసారి సెనేటర్‌గా ఎన్నికైన తర్వాత ముంబయి నుంచి బైడెన్ పేరిట తనకు ఓ లేఖ వచ్చిందని చెప్పారు. 

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన సమావేశంలో సరదా సంభాషనలు నవ్వులు పూయించాయి. మనదేశంలో ఇంటిపేరుతో సంబంధాలు కలుపుకునే తీరును అమెరికా అధ్యక్షుడు ప్రస్తావిస్తూ తన ఇంటిపేరు కలిగినవారూ ఇండియాలో ఉన్నారని వివరించారు. తనకూ భారత్‌తో సంబంధాలున్నాయని చెప్పారు. బైడెన్ సరదా సంభాషణకు ప్రధాని మోడీ ఫినిషింగ్ టచ్ ఇచ్చి సమావేశాన్ని మరింత ఆహ్లాదపరిచారు.

1972లో తాను తొలిసారిగా సెనేటర్‌గా ఎన్నికైనప్పుడు బైడెన్ పేరుతో ఓ లెటర్ వచ్చిందని, అది ముంబయి నుంచి వచ్చిందని ప్రధాని మోడీతో బైడెన్ అన్నారు. తన ఇంటి పేరు కూడా బైడెన్ అని లేఖలో ఆ వ్యక్తి పేర్కొన్నారని వివరించారు. అంతేకాదు, తనకు ఎవరైనా ఇండియాలో బంధువులున్నారా? అని కూడా అడిగారని గుర్తుచేసుకున్నారు. కానీ, ఆ తర్వాత తనకు లేఖ రాసిన వ్యక్తిని పట్టుకోలేకపోయానని చెప్పారు. అయితే, తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2013లో ఓ సారి ముంబయి వెళ్లాల్సి వచ్చిందని, అప్పుడు మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని గుర్తుచేశారని నవ్వుతూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, వారే ఇండియాలో ఐదుగురు బైడెన్‌లు ఉన్నట్టు తనకు చెప్పారని వివరించారు. ఈ సంభాషణలు హాల్‌లో ఉన్నవారంతా నవ్వారు.

ఆ జోక్‌ను బైడెన్ మరింత పొడిగించారు. ఈస్టిండియా టీ కంపెనీలో కెప్టెన్ జార్జ్ బైడెన్ ఉండేవారన్నారు. ఆయన ఐరిష్ పర్సన్ అని, అక్కడే చాన్నాళ్లు ఉన్నారని, ఓ భారతీయురాలిని పెళ్లి చేసుకున్నారని నవ్వుతూ మీకు జోక్ అర్థమయింది కదా.. అంటూ అడిగారు.

వారిని తాను ఇప్పటి వరకు కనుగొనలేకపోయారని, ఈ సమావేశమైనా వారిని వెతికిపెట్టడంలో పనికి వస్తుందని బైడెన్ అన్నారు. ఈ జోక్‌లతో హాల్‌లో నవ్వులు విరిశాయి. కాగా, ప్రధాని మోడీ ఆ జోక్‌ను కొనసాగిస్తూ.. తాను కొన్ని పత్రాలు తెచ్చారని, వారంతా తమ బంధువులేనని ముగించారు. మరోసారి అందరూ ఘొళ్లుమన్నారు.

click me!