టీచర్లు కావాలనుకున్నారు.. ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

By telugu teamFirst Published Sep 25, 2021, 4:30 PM IST
Highlights

చదువుపూర్తి చేసుకుని ఇక ఉద్యోగం వైపుఅడుగులు వేసిన ఆ ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. టీచర్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ రాయడానికి బయల్దేరిన ఆ ఆరుగురు జైపూర్ సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అభ్యర్థులు ప్రయాణిస్తున్న వ్యాన్ ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా వ్యాన్‌లోని మిగతా ఐదుగురు గాయాలపాలయ్యారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

జైపూర్: చదువు పూర్తి చేసుకున్నారు. ఉద్యోగ వేటలో పడ్డారు. ఉపాధి సంపాదించుకుని కుటుంబ బాధ్యతలు ఎత్తుకుందామనుకున్నారు. టీచింగ్‌ కెరీర్‌ను ఎంచుకున్నారు. రాజస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ రాయడానికి పొద్దునే బయల్దేరారు. కానీ, వారు ఆశలు ఆవిరయ్యారు. వారి కలలు నడిరోడ్డుపై కల్లలయ్యాయి. రాష్ట్ర రాజధాని జైపూర్ సమీపంలో చాక్సు ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు క్యాండిడేట్లు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ఓ ట్రక్‌ను ఢీకొనడంతో ఆరుగురు అభ్యర్థులు మరణించారు. ఆ వ్యాన్‌లోని మిగతా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

రాజస్తాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ టీచర్ రాయడానికి బరాన్ జిల్లాకు చెందిన ఆశావాహులు సికార్‌కు బయల్దేరారు. ఈ పరీక్ష రేపు జరగనుంది. ముందుగానే సెంటర్ సమీపానికి చేరడానికి బయల్దేరారు. కానీ, ఎన్‌హెచ్ 12 రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

గాయపడిన మిగతా ఐదుగురిని వివిధ హాస్పిటళ్లకు చేర్చారు.  చాక్సులోని హాస్పిటల్‌లో ఇద్దరు మహాత్మా గాంధీ హాస్పిటల్‌కు ఇద్దరు, జైపూర్‌లోని హాస్పిటల్‌కు ఇంకొకరిని చికిత్స కోసం తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పరీక్ష కంటే ప్రాణాలు చాలా విలువైనవని, ఈ పరీక్ష రాయడానికి వెళ్తున్నవారు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రభుత్వ వాహనాల్లోనే ప్రయాణాలు చేసి సురక్షితంగా గమ్యం చేరాలని కోరారు. మృతుల కుటంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేల పరిహారాన్ని ఆయన ప్రకటించారు.

ఈ నెల 26న అంటే రేపు రాష్ట్రవ్యాప్తంగా రాజస్తాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ టీచర్ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో ఇది కీలకమైన పోటీ పరీక్ష అందుకే ఈ పరీక్షకు సుమారు 16.5 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు అంచనాలున్నాయి.

click me!