
భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా, వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపుతూ, “ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకుని, వైద్యుల సూచనల మేరకు ఉపరాష్ట్రపతి పదవిని తక్షణమే రాజీనామా చేస్తున్నాను,” అని ధన్‌ఖర్ తెలిపారు.
74 ఏళ్ల జగ్‌దీప్ ధన్‌ఖర్ 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా పదవి చేపట్టారు. 2027 వరకు పదవిలో కొనసాగాల్సి ఉండగా, మధ్యలోనే పదవి నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉపరాష్ట్రపతిగా ఆయన రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఎన్నో సందర్భాల్లో విపక్షాలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
ఎన్డీఏ మళ్లీ నూతన అభ్యర్థి ఎంపికలో తలమునకలవుతోంది. ధన్‌ఖర్ రాజీనామా అనంతరం, ఎన్డీఏ ప్రభుత్వం కొత్త ఉపరాష్ట్రపతి ఎంపికపై చర్చలు ప్రారంభించింది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నిక విషయలంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది కాబట్టి, నూతన అభ్యర్థిని ఎంపిక చేయడం పెద్ద సమస్య కాదన్న అభిప్రాయం ఉంది.
ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుందనే విషయం తెలిసిందే. ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉంటారు. అంటే లోక్ సభ, రాజ్య సభ సభ్యులు రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
ఉప రాష్ట్రపతి పదవికి గవర్నర్లు, సీనియర్ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గతంలో ధన్‌ఖర్ కూడా బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యారు. 2017లో వెంకయ్య నాయుడు కూడా పార్టీ ముఖ్యనాయకుడిగానే ఎంపికయ్యారు.
ఈ నేపథ్యంలో జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేరు మొదటిగా వినిపిస్తోంది. ఆయన 2020 నుంచి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయనకు ప్రభుత్వంలో మంచి విశ్వాసం ఉంది. అనుభవజ్ఞుడుగా హరివంశ్ గుర్తింపు పొందారు.
ధన్‌ఖర్ రాజీనామా చేయడం భారత ఉపరాష్ట్రపతి చరిత్రలో మూడోసారి మాత్రమే జరిగింది. ఇప్పటివరకు VV గిరి, ఆర్. వెంకటరామన్ మాత్రమే పదవిలో ఉండగానే రాజీనామా చేశారు. అయితే వారు రాష్ట్రపతి పదవికి పోటీలో నిలిచేందుకు రాజీనామా చేయగా, ధన్‌ఖర్ మాత్రం ఆరోగ్య కారణాల వల్లే తప్పుకున్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన తర్వాత ఆరు నెలల లోపు కొత్తవారిని ఎన్నిక చేయాలి. అప్పటివరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభను నడిపే బాధ్యతను చేపడతారు.