
ఇవాళ(శుక్రవారం) ఉదయం దేశంలోని పలు నగరాల్లో కలకలం రేగింది. దేశ రాజధాని డిల్లీతో పాటు ఐటీ సిటీ బెంగళూరులోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూల్ యాజమాన్యాలు, సిబ్బందితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. రెండు నగరాల్లో కలిపి మొత్త 90 విద్యాసంస్థల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులో 40, డిల్లీలో 50 స్కూళ్ళకు బాంబు బెదిరింపు వార్తలతో ఈ రెండు నగరాలు ఉలిక్కిపడ్డాయి.
బాంబు బెదిరింపులతో వెంటనే స్పందించిన అధికారులు విద్యార్థులతో పాటు సిబ్బందిని ఖాళీ చేయింంచారు. బాంబు స్క్వాడ్స్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అలాగే స్థానిక పోలీసులు కూడా డాగ్ స్క్వాడ్ తో స్కూల్స్ పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు ప్రారంభించారు. ఇప్పటివరకయితే ఎక్కడా బాంబుల జాడ లభించలేదు.
ఒకే రోజు రెండు ప్రధాన నగరాల్లో ఇలాంటి హెచ్చరికలు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. స్కూల్స్ కి బాంబు బెదిరింపులు ఎవరైనా ఆకతాయిల పనా లేక నిజంగానే ఉగ్రమూకలు ఇలాంటి దారుణాలకు ప్లాన్ చేస్తున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. రెండు నగరాల్లోనూ స్కూళ్లకు ఈ బెదిరింపులు మెయిల్, ఫోన్ కాల్స్ రూపంలో వచ్చినట్లు సమాచారం.
ఈ ఘటనపై డిల్లీ, బెంగళూరు పోలీసులు కేసులు నమోదు చేసి సైబర్ క్రైమ్ విభాగాలతో కలిసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని... పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.
బాంబు బెదిరింపులపై సమాచారం అందినవెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్స్ వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ పిల్లలను వెంటనే స్కూల్ నుండి తీసుకెళ్లిపోయారు పేరెంట్స్. సోషల్ మీడియాలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన సమాచారం వైరల్ గా మారింది. ఈ బాంబు బెదిరింపులు దేశంలో విద్యాసంస్థల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.