
వీఎస్ అచ్చుతానందన్ జూన్ 23న గుండెపోటు బారినపడడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. అచ్చుతానందన్ భౌతికకాయాన్ని మంగళవారం ఆలప్పుళలోకి తరలిస్తారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం పినరయి విజయన్, రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ తదితర పార్టీ నేతలు ఆసుపత్రికి వెళ్లి నివాళులు అర్పించారు.
2019 తర్వాత వీఎస్ అచ్యుతానందన్ రాజకీయంగా యాక్టివ్‌గా లేరు. సుమారు 50 సంవత్సరాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మూడుసార్లు ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు.
1985లో సీపీఎంను కేంద్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తూ పొలిట్ బ్యూరోలో చేరారు. కానీ, నాయకత్వ మధ్య విభేదాల కారణంగా 2009లో పొలిట్ బ్యూరోను విడిచిపెట్టారు. 1965లో అంబలపుళ నుంచి ఓటమితో రాజకీయ జీవితం ప్రారంభమైనా, తర్వాతి కాలంలో ఆయన బలమైన ప్రజాధరణ కలిగిన నేతగా ఎదిగారు. ఆయన అంబలపుళ, మారారికుళం, మలప్పురం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. చివరి సారిగా 2016 ఎన్నికల్లో పోటీ చేశారు.
వీఎస్ 1923లో పున్నప్రా గ్రామంలో శంకరన్, అకమ్మ దంపతులకు జన్మించారు. ఇది కేరళ కమ్యూనిస్టు ఉద్యమానికి పునాది వేసిన ప్రదేశం. 1970లో ఆలప్పుళా ప్రకటన ఆయన రాజకీయ జీవితానికి మలుపు తిప్పింది. ఈయెమ్మెస్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మున్నార్‌లో భూకబ్జాలపై చర్యలు, వల్లార్పాడం టెర్మినల్ కోసం భూ సేకరణ, కొల్లం ఐటీ పార్క్ స్థాపన, కణ్నూరు విమానాశ్రయ ప్రతిపాదన, చెర్తలలో ఇన్ఫోపార్క్ ఏర్పాటు, పొలాల పరిరక్షణ కోసం ప్రత్యేక డ్రైవులు, అక్రమ లాటరీ మాఫియాలపై పోరాటం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.