PSLV C-61:ఇస్రో ప్ర‌యోగంలో అంత‌రాయం.. సాంకేతిక స‌మస్య‌ల‌తో

Narender VaitlaPublished : May 18, 2025 6:48 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం PSLV C-61 చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆదివాయం ఉద‌యం శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష కేంద్రం నుంచి రాకెట్‌ను ప్ర‌యోగించారు. అయితే ప్ర‌యోగం మొద‌లైన కాసేప‌టికే మిష‌న్ ఫెయిల్ అయిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. వివ‌ర‌ల్లోకి వెళితే..   

ఇస్రో ఆదివారం చేప‌ట్టిన PSLV-C61 రాకెట్ ప్రయోగం అపూర్వమైన మైలురాయిగా భావించారు. అయితే, ఈ మిషన్‌లో మూడో దశ సమయంలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల లక్ష్యం చేరుకోలేకపోయినట్టు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.

PSLV-C61 ద్వారా EOS-09 శాటిలైట్‌ను ఆదివారం ఉదయం 5:59 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇది ఇస్రో 101వ ప్రయోగం కాగా, PSLV రాకెట్‌కు ఇది 63వ ప్రయోగం. ఇక PSLV-XL కాన్ఫిగరేషన్ ఉపయోగించి ఇది 27వ ప్రయోగం.

ప్రయోగానికి ముందు, శుక్రవారం ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ సమయంలో PSLV-C61 మోడల్‌ను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్థించారు.

EOS-09 శాటిలైట్ విశేషాలు:

ఈ శాటిలైట్ బరువు సుమారు 1,696 కిలోలు

ఇది భూమి పరిశీలన శాటిలైట్ల సీస్టంలో భాగం కానుంది

ఇది గతంలో 2022లో ప్రయోగించిన EOS-04 శాటిలైట్‌కు కొనసాగింపు

RISAT-1B అనే పేరుతో కూడా పిలిచే ఈ శాటిలైట్, RISAT-1 మాదిరిగా పని చేస్తుంది

ఇది Resourcesat, Cartosat, RISAT-2B శాటిలైట్ల డేటాను విశ్లేసిస్తుంది. 

ప్రధానంగా రిమోట్ సెన్సింగ్ డేటాను అందించేందుకు దీనిని రూపొందించారు. 

ఇస్రో ఈ మిషన్‌ను దేశానికి ఎంతో కీలకంగా అభివర్ణించింది. అయితే ఈసారి తాత్కాలికంగా ఆటంకం ఏర్పడినప్పటికీ మ‌రికొన్ని రోజుల్లోనే ఈ మిష‌న్‌ను మ‌ళ్లీ విజ‌య‌వంతం చేస్తామ‌ని శాస్త్రవేత్త‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. 

Read more Articles on
click me!